ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు.. : మంత్రి తుమ్మల

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులందరికి

Update: 2024-10-09 13:47 GMT

దిశ, ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులందరికి అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.బుధవారం మంత్రి, రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాలలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రఘునాథపాలెం మండలంలో మంత్రి పర్యటించి ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. నిధులు రూ. 14 లక్షలతో మంగ్యాతండాలో చేపట్టిన (3 ) అంతర్గత సీసీ. రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణ పనులకు, రూ. 14 లక్షలతో కె.వి. బంజరలో చేపట్టిన (2 ) అంతర్గత సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, రూ. 29 లక్షలతో మూల గూడెంలో చేపట్టిన (4) అంతర్గత సీసీ రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు చేసారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... రఘునాథపాలెం మండలం వ్యాప్తంగా ఇల్లు లేని, గుడిసెలు, రేకుల షెడ్డులలో ఉంటున్న పేదల జాబితాను తీసుకోవాలని, ముందస్తుగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసుకోవడం జరుగుతుందని, దశల వారీగా ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు అందేలా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రఘునాథపాలెం మండలంలో 72 అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు ఉండాలని, పెండింగ్ లేకుండా అంగన్వాడి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, కొత్త భవనాలు లేని కేంద్రాలకు ప్రతిపాదన సమర్పించాలని, పాఠశాలల అభివృద్ధికి అవసరమైన పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

రూ. 2లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులకు షెడ్యూల్ ప్రకటించి రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ పథకం అందుతుందని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామాలలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, నీళ్లు రోడ్డుపై నిలవకుండా డ్రైయిన్లు కూడా నిర్మిస్తున్నామని, వర్షపు నీరు నేరుగా డ్రైయిన్లకు వచ్చే విధంగా రోడ్ల నిర్మాణం పక్కాగా జరగాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News