భద్రాద్రి జిల్లా సమగ్రాభివృద్ధికి పోరాటాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధికి దశలవారీగా పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు.

Update: 2024-12-22 10:18 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధికి దశలవారీగా పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మంచి కంటి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రెండు రోజులపాటు ఇల్లెందు పట్టణంలో సీపీఎం మహాసభలు జరిగాయని, ఈ సభలలో భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి చర్చించినట్టు తెలిపారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోగా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

    సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ముందుగా భద్రాద్రి జిల్లా పరిసర ప్రాంతాలకు నీటి వనరులు ఇచ్చిన తర్వాతనే పక్క ప్రాంతాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కొంతమంది పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా అనేకమంది సాగుదారులకు పట్టాలు రాలేదని, వారందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్త పరిశ్రమలు ప్రారంభం కాకపోగా ఉన్న పరిశ్రమలు మూతపడడం వల్ల నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరిగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలపై దృష్టి సారించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా విద్య, వైద్యరంగం అభివృద్ధికి పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. విలేకర్ల సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు అన్నవరం కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, భూక్య రమేష్, మహిళ నాయకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 


Similar News