పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి
పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలని ఎలక్ట్రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి అన్నారు.
దిశ, కొత్తగూడెం : పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలని ఎలక్ట్రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ఎలక్ట్రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి స్పెషల్ సమ్మరీ రివిజన్ 20 -25 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకి పూల మొక్క ఇచ్చి కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఆమెకు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ ఐడీ కార్డుల జారీ, పోలింగ్ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లు తదితర అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో షెడ్యూల్డ్ ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫామ్ 6,7,8, లను వెంటనే పరిష్కరించాలని, దివ్యాంగ ఓటర్లను గుర్తించాలని, షెడ్యూల్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని, వారి సలహాలు, సూచనలు ఎన్నికల కమిషన్కు పంపాలన్నారు.
నాణ్యమైన ఓటరు ఎపిక్ కార్డులను ప్రింట్ చేసి పంపిణీ చేయాలన్నారు. ఓటర్ అవగాహన పై స్వీప్ ఆక్టివిటీస్, స్టార్ క్యాంపైనర్స్ ద్వారా డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్ కాలేజీలతో పాటు అన్ని విద్యాసంస్థలలో కార్యక్రమాలు నిర్వహించి ఓటరు నమోదు, ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగుల కోసం ర్యాంప్స్ ఏర్పాటు చేయాలని, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా సౌకర్యం, అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, తహసీల్దార్లు, ఎలక్షన్ సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.