ఇక పర్యాటకులకు కనువిందే
సుదూర ప్రాంతాల నుండి భద్రాచలం పుణ్యక్షేత్రంకు వచ్చే భక్తులకు రామయ్య దర్శనం అనంతరం దర్శనీయ స్థలాలు లేకుండా పోయాయి.
దిశ, భద్రాచలం : సుదూర ప్రాంతాల నుండి భద్రాచలం పుణ్యక్షేత్రంకు వచ్చే భక్తులకు రామయ్య దర్శనం అనంతరం దర్శనీయ స్థలాలు లేకుండా పోయాయి. ఇటువంటి పరిస్థితిలో పర్యాటకులకు కనువిందు చేసేలా భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయలు ప్రతిబింబించేలా కళాకృతులు పొందుపరుస్తున్నారు. గిరిజనుల జీవన విధానం, వారు ఉపయోగించే వస్తువులు, వారి వస్త్రధారణ ఎలా ఉంటుంది... ఆదివాసీల వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు, వారి పండుగలు ఉట్టిపడేలా ఈ మ్యూజియం నిర్మాణం సాగుతుంది.
అంతే కాకుండా సందర్శించే పర్యాటకులకు అక్కడే గిరిజన వంటలను రుచి చూపించనున్నారు. గిరిజనులు అంత ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి గల వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో పర్యాటకులు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ప్రత్యేక చొరవతో ప్రతిష్టత్మాకంగా తీసుకుని మ్యూజియంను సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. అంతే కాకుండా గిరిజనుల నృత్యాలు, పలు వాయుద్య పరికరాలు కూడా ఇప్పటికే సేకరించారు. అలాగే వారు వేటకు ఉపయోగించే ఆయుధాలు కూడా సందర్శకులను ఆకట్టుకోనున్నాయు. పూర్తి గ్రామీణ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయు. ముక్కోటి నాటికి భద్రాద్రికి వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించడానికి మ్యూజియంను సిద్ధం చేస్తున్నారు.