వైరా మున్సిపాలిటీ రాజకీయాల్లో మలుపుల పర్వం

వైరా మున్సిపాలిటీ రాజకీయాల్లో మలుపుల పర్వం కొనసాగుతూనే ఉంది. పొంగులేటి వర్గీయులు ఒకవైపు... Latest News of Wyra Municipality

Update: 2023-02-23 13:21 GMT

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీ రాజకీయాల్లో మలుపుల పర్వం కొనసాగుతూనే ఉంది. పొంగులేటి వర్గీయులు ఒకవైపు, బీఆర్ఎస్ శ్రేణులు మరోవైపు ఒకరిపై మరొకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. చైర్మన్ పై అవిశ్వాస తీర్మాన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈనెల 20న వైరా మున్సిపాలిటీలోని 16 మంది కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ ప్రవేశపెట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. అనంతరం మున్సిపాలిటీ చైర్మన్ పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ బుధవారం సాయంత్రం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్సీ తాతా మధు సమక్షంలో జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ కు ఫిర్యాదు చేసిన విషయము పాఠకులకు విధితమే.

అయితే తనపై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని చేస్తున్న ప్రయత్నాన్నీ చైర్మన్ జైపాల్ అడ్డుకునేందుకు తన శక్తికి మించి పోరాడుతున్నారు. ఈనెల 20న కౌన్సిలర్లు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడంతో చైర్మన్ ఎత్తులకు పైఎత్తు వేశారు. ఈనెల 21న కొంతమంది పొంగులేటి వర్గీయులతో కలిసి చైర్మన్ హైదరాబాద్ లో హైకోర్టులో తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించినట్లు దిశ ప్రతినిధికి సమాచారం అందింది. ఈనెల 21వ తేదీన చైర్మన్ స్టే కోసం హైకోర్టును ఆశ్రయించగా 22వ తేదీ ఉదయం 10 గంటలకు హైకోర్టు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయంపై స్టే ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

కలెక్టర్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన వినతి పత్రం జిరాక్స్ ద్వారా కోర్టులో స్టేకు చైర్మన్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రం జిరాక్స్ పత్రాలు పొంగులేటి వర్గీయుల చేతికి ఎలా వెళ్లాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో చైర్మన్ జైపాల్ కు కొంతవరకు ఊరట లభించగా, బీఆర్ఎస్ శ్రేణులు సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. వైరా మున్సిపాలిటీ కౌన్సిలర్లలో పొంగులేటి వర్గంలో చైర్మన్ తో కలిపి నలుగురు కౌన్సిలర్ మాత్రమే ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే మొత్తం 13 మంది కౌన్సిలర్లు కావాల్సి ఉంది. అంతమంది కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునే బదులు కోర్టులో స్టే తెచ్చుకోవటమే ఉత్తమమని పొంగులేటి వర్గీయులు భావించారని సమాచారం. అందులో భాగంగానే హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. చైర్మన్ స్టే తీసుకురావడంతో బీఆర్ఎస్ పార్టీ తన తదుపరి కార్యాచరణను ఏ విధంగా చేపడుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News