జీజీహెచ్ కు ఇంచార్జి ఏ దిక్కు..

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)కు జబ్బు చేసింది. ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు వైద్యానికి దూరం అవుతున్నారు.

Update: 2024-10-21 14:16 GMT

దిశ, ఖమ్మం : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)కు జబ్బు చేసింది. ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు వైద్యానికి దూరం అవుతున్నారు. అని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు పరిస్థితి నెలకొంది. గతంలో ఇదే ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో ఎన్నో అవార్డులు.. రివార్డులు.. దక్కించుకున్న ఆసుపత్రి నేడు రోగులకు వైద్యసేవలు అందించలేక అభాసుపాలు అవుతుంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు సరైన వైద్యం అందించలేక పోతున్నాము అంటూ లోలోపల మదన పడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకు అనుసంధానం చేసిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ప్రభుత్వాసుపత్రికి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సూపరింటెండెంట్ లేకపోవడంతోనే సరైన నిర్ణయాలు జరగటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జీజీహెచ్ కు ఇంచార్జ్ సూపరింటెండెంట్ తోనే కాలం సాగిస్తున్నారని రోగులు చెప్తున్నారు.

ఆసుపత్రిలో వసతులు కావాలంటే రోగులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ.. ఎంఐసీయూలలో సరైన ఏసీలు లేకపోవడంతో పాటు, ఉన్న ఏసీలు పనిచేయకపోవడంతో ఎమర్జెన్సీ ఐసీయూలో ఉన్న రోగులు తీవ్ర అసౌకర్యాల గురవుతున్నారు. దాంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగించే సిటీ స్కానింగ్ కూడా పని చేయకపోవడంతో ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి నెలకొంది. మాత శిశు కేంద్రంలో గర్భిణులకు ఉపయోగించే స్కానింగ్ లు కూడా పూర్తిస్థాయిలో రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఎస్సార్ లను వినియోగించుకుంటున్నారు. మరోపక్క గర్భిణీలకు అత్యవసర సమయంలో వినియోగించే టిఫా స్కానింగ్‌ వినియోగంలో లేదు. టిఫా స్కానింగ్ కోసం గర్భిణీలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లకు ఆశ్రయిస్తున్నారు.

సమస్యల వలయంలో జీజీహెచ్..

ఖమ్మం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. రోగులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారని తెలుస్తోంది. దాంతో పాటు ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు కూడా సరైన బాత్రూంలో లేకపోవడంతో వైద్యులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ వార్డ్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ల వద్ద రోగులకు కనీస వసతులు కల్పించే విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవడం లేదని రోగులు చెబుతున్నారు. మాత శిశు కేంద్రాల్లో గర్భిణులకు కాన్యులా పెట్టే నర్సులు కూడా లేరు. కాన్యులా పెట్టిన తర్వాత చేతులు ఉబ్బిపోతున్నాయి. వార్డులలో నర్సుల పనితీరును పరిశీలించే నర్సింగ్ సూపరింటెండెంట్ లు అందుబాటులో ఉండటం లేదని రోగులు చెబుతున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ లు విధులు నిర్వహించకుండా రూముల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

గర్భిణీలకు ఏదైనా అత్యవసరం ఉంటే గర్భిణుల పక్కన ఉండే అటెండర్లు వెళ్లి చెప్పేదాకా సమస్య పరిష్కారం కావడం లేదు. రోగులకు మంచినీటి వసతి, రోగులకు మరుగుదొడ్లు సరైన పరిశుభ్రం లేకపోవడంతో రోగులు దానిని వినియోగించుకోవాలంటే మక్కువ చూపటం లేదు. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్న ఆసుపత్రి మాత్రం అపరిశుభ్రంగా నే కనిపిస్తూనే ఉంది. జీజీహెచ్ ఆస్పత్రికి జిల్లా కలెక్టర్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ సందర్శించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచిస్తున్న ఆ తరహా స్థాయిలో వైద్యం అందించలేకపోతున్నారు.

ఏది చేయాలన్న పై నుంచి ఆర్డర్ వస్తేనే పనులు..

జీజీహెచ్ ఆసుపత్రిలో ఏది చేయాలన్న పై అధికారులకు నివేదిక ఇయ్యాల్సిందే. పై అధికారుల నుంచి అనుమతి వచ్చిన తర్వాత పనులు నిర్వహించే పరిస్థితి నెలకొంది. గతంలో ఇదే ఆస్పత్రి వైద్యవిధాన పరిషత్ లో ఉన్నప్పుడు నిధులకు కొరత ఉండేది కాదు. ఏది కొనుగోలు చేయాలన్నా వెంటనే కొనుగోలు చేసి అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం డీఎంఈ ఆధీనంలో వచ్చిన తర్వాత ఆసుపత్రి అకౌంట్లో సరైన నిధులు లేక పోవడంతో అధికారులు ఏదీ చేయాలన్న పై నుంచి పర్మిషన్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

జీజీహెచ్ ఎకౌంట్లో సరైన నిధులు లేకపోవడంతో డీఎంఈ బడ్జెట్ విడుదల చేసిన తర్వాత పనులు పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సీటీ స్కానింగ్ మిషన్ కేబుల్ పాడవటంతో కేబుల్ కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించే పరిస్థితి ఉంది‌. బడ్జెట్ విడుదల చేసి కేబుల్ కొనుగోలు చేసిన తర్వాత మిషిన్ నడిచే పరిస్థితి ఉందని వైద్యులు చెప్తున్నారు. ఐసీయూలో ఏసీలు పనిచేయడం లేదని సూపరింటెండెంట్ పై అధికారులకు నివేదిక ఇచ్చిన కూడా ఇప్పటివరకు సమాధానం రాలేదు. ప్రభుత్వం రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని మంత్రులు చెబుతున్న ఆ స్థాయిలో రోగులకు వైద్యం అందడం లేదని ఆరోపణలు గుప్పుమ్మంటున్నాయి.

పాలకులు దృష్టి సారిస్తేనే సమస్యలకు పరిష్కారం..

జిల్లా కేంద్రంలో ఉన్న జీజీహెచ్ ఆసుపత్రి సమస్యల పరిష్కారం కోసం పాలకులు దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు. గతంలో ఇదే ఆస్పత్రి లక్షల మందికి వైద్యాన్ని అందించి నేడు రోగులకు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నామని పాలకుల వైపు చూస్తుంది. జీజీహెచ్ ఆస్పత్రికి ప్రతిరోజు 1500 నుండి 2,000 మంది నిరుపేద రోగులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అత్యవసర వైద్యం చేయాలంటే రోగులకు సరైన వసతులు కల్పిస్తేనే వైద్యులు చేసే పరిస్థితి లేదని తెలుస్తుంది. ఇప్పటికైనా పాలకులు దృష్టి సారించి జీజీహెచ్ ఆసుపత్రికి వైద్యం చేయాలని ప్రజానీకం కోరుతున్నారు.


Similar News