సింగరేణిలో 50 శాతం గుజరాత్ కంపెనీలే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి బొగ్గు గనుల్లో దాదాపు 50% గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రైవేటు కంపెనీలే ఎక్కువగా ఉన్నాయని సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ బృందాకరత్ అన్నారు.

Update: 2024-10-21 12:26 GMT

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి బొగ్గు గనుల్లో దాదాపు 50% గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రైవేటు కంపెనీలే ఎక్కువగా ఉన్నాయని సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ బృందాకరత్ అన్నారు. సింగరేణి మొత్తం గుజరాత్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తుల చేతిలోనే ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మండలంలో ఉన్న బొగ్గు గనులను సీపీఎం పార్టీ నాయకులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం బొగ్గు ఓసీ పని ప్రదేశాలను పరిశీలించారు. స్థానిక సింగరేణి అధికారులతో కలిసి వివరాలు తెలుసుకున్నారు. తరువాత దుర్గా, మహాలక్ష్మి, వీపీఆర్, ఎంఐపీఎల్ కంపెనీలలో పనిచేసే కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. సింగరేణిలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులే బొగ్గు, ఓబి వెలికి తీస్తున్నారని ఆమె ఆరోపించారు. దీంతో అసలు కార్మికులు తక్కువవుతున్నారని.. కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువవుతున్నారని నొక్కి చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్ లన్నీ కూడా 50 శాతం ప్రైవేటు, 50 శాతం సింగరేణి కలిసి ఓబి, బొగ్గును వెలికి తీస్తున్నాయని తెలిపారు. బొగ్గు గనుల ద్వారా వేలాది ప్రభుత్వ, అటవీ శాఖ భూములు ధ్వంసం అయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. 1991 తర్వాత ప్రైవేటీకరణ వేగంగా పెరిగిందన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో స్థానిక భూ నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. భూములు ఒకరివి.. ఉద్యోగాలు మరొకరికి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికులు భూములు కోల్పోయి ఉద్యోగులు రాక ఎస్సీ, ఎస్టీ వేలాది పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఏజెన్సీ ఏరియాలో ఆదివాసి చట్టాలను అమలు చేయకపోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ప్రాంత గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. భూములు కోల్పోయిన గిరిజనులకు సరైన నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. మణుగూరులో స్థానికుల కంటే ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 80 శాతం కార్మికులు ఓబి కంపెనీలలో పని చేస్తున్నారని వారికి కూడా సరైన సౌకర్యాలు అందించక అధిక పని గంటలు పని చేపించుకుంటున్నారని ఆరోపించారు.

కార్మికులు పని ఒత్తిడి కారణంగా ఒత్తిడి గురై తీవ్ర ఆందోళనకు చెందుతున్నారన్నారు. ఒక్కొక్క రూమ్ లో కార్మికులను బందిస్తున్నారన్నారు. సింగరేణి గనుల్లో కార్మిక చట్టాల అమలు చేయాలని, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మొదటిసారి కొత్త కొండాపురం నిర్వాసితులకు ఎకరానికి 3,500, ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారని తెలిపారు. రెండోసారి ఓసీ కారణంగా కొండాపురం గ్రామానికి సరైన ప్యాకేజీ అందక చాలామంది భూములు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూముల గుంజుకున్నారని ఆరోపించారు. భూ నిర్వాసితులకు అన్యాయం చేసే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు సీపీఎం పార్టీ అండగా నిలబడుతుందని తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News