ఆహ్లాదం కోసం వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి

ఆహ్లాదం కోసం వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Update: 2024-12-30 16:44 GMT

దిశ, ఖమ్మం : ఆహ్లాదం కోసం వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు, ప్రజాదీవెనల తో నాకు సేవ చేసే భాగ్యం దక్కిందని అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర వాసులకు పర్యాటక ఆహ్లాదం కోసం వెలుగుమట్లలో ఐదు వందల ఎకరాల్లో అర్బన్ పార్క్ ను ఏకో పార్క్ లా అభివృద్ధి చేస్తామని తెలిపారు. చారిత్రక వారసత్వంకు ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లా పై రోప్ వే ఏర్పాటు చేసి ఖమ్మంను పర్యాటకంగా తీర్చిదిద్దామన్నారు. సాయంత్రం పూట ప్రజలకు ఆహ్లాదం కోసం లకారం ట్యాంక్ బండ్ వద్ద శిల్పారామం ఏర్పాటు ప్రతిపాదన చేశామని తెలిపారు‌. ఖమ్మం నగరంలో మున్నేరు వరద ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం రూ.700 కోట్లతో మున్నేరు ఇరు వైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మాణం చేస్తామన్నారు.

    ఖమ్మం నగరంలో వచ్చే వరద నీళ్లను డ్రైనేజీల ద్వారా మళ్లించేందుకు రూ. 220 కోట్లతో నిర్మాణం చేపడతామన్నారు. రఘునాథపాలెం మండలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను వైద్య విద్యా రంగంలోనే మోడల్ గా నిర్మాణం చేసి ప్రజలకు అందిస్తామన్నారు. రఘు నాథపాలెం దశాబ్దాల సాగు నీటి కలను సాకారం చేస్తూ సాగర్ కెనాల్ పై లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సంక్రాంతి రోజున రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తన పదవీ కాలంలోనే పూర్తి చేయాలనేది తన కోరికని తెలిపారు. ప్రకాశ్ నగర్ మున్నేరు హై లెవల్ బ్రిడ్జి మరమ్మతు పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కాల్వ ఒడ్డు బ్రిడ్జి వద్ద నిర్మాణం చేసే కేబుల్ బ్రిడ్జి ఇతర జిల్లాలకు ఐకానిక్ గా నిలుస్తుంది అన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ మాదిరిగానే ఖమ్మం నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేసి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దామన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం లక్ష్యం అన్నారు.

    వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి సత్తుపల్లి నియోజకవర్గంలోని యాతాల కుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి, అశ్వారావు పేటకు సాగునీరు అందిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలో టన్నెల్ పూర్తయితే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ గోదావరి నీళ్లు వస్తాయన్నారు. సీతమ్మ సాగర్ పూర్తయితే పోలవరం టూ సీతమ్మ సాగర్ అక్కడి నుంచి సమ్మక్క సాగర్ కు అక్కడ నుంచి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ వరకు గోదావరి నీళ్లు వస్తాయి అన్నారు. దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాద్రి కి రైల్వే లైన్ ఏర్పాటు తో భక్తులకు, పర్యాటకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు కొమర్తపు మురళి, రావూరి సైదబాబు తదితరులు పాల్గొన్నారు.


Similar News