భారత దేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచింది కాంగ్రెస్ పార్టీ
భారత దేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచిన పార్టీ కాంగ్రెస్ అని ,తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మోసం చేసిన చరిత్ర కేసీఅర్ ది అని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
దిశ, ఖమ్మం : భారత దేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచిన పార్టీ కాంగ్రెస్ అని ,తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మోసం చేసిన చరిత్ర కేసీఅర్ ది అని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని 9,10 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో తుమ్మల పాల్గొని ప్రసంగించారు. నలబై సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను ఎవరినీ బెదిరించింది లేదని, కానీ ఈనాడు ఖమ్మంలో అడుగడుగునా బెదిరింపులు, భూ కబ్జాలు, చివరికి గంజాయి మాఫియాను కూడా తయారు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులది అన్నారు. ఖమ్మంలో నీచమైన రాజకీయాలకు తెగబడ్డారని,
డాక్టర్ల భూముల నుండి మొదలు సామాన్యులు భూములను, ఆఖరికి శ్మశానాలను కూడా వదిలి పెట్టకుండా కబ్జాలు చేసిన దుర్మార్గులను ఖమ్మం పట్టణం మీదకు వదిలి సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నారని అన్నారు. పాలేరు లో చెల్లని రూపాయి ఖమ్మంలో చెల్లుతుందా అని అంటున్నారని, నువ్వు చెల్లని రెండువేల రూపాయల నోట్ లాంటోడివని, తాను డాలర్ లాంటోడినని, ఏ దేశం పోయినా చెల్లుతుందని అన్నారు. ఈ జిల్లాల్లో ఎక్కడ నుండైనా పోటీ చేసి గెలిచే సత్తా తన కుందని, నువ్వు మాత్రం ఖమ్మం దాటితే ఎవడివో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. తానెక్కడా ఆయన లాగా కుల సంఘాల్లో,మత సంఘాల్లో వేలుపేట్టి వారిని విడగొట్టి పాలించిన చరిత్ర లేదని అన్నారు. తాను ఎక్కడ పోటీ చేసి గెలిచినా ఖమ్మం నగరాన్ని మరిచి పోలేదని, అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనీఫెస్టో లోని ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి పేద, బడుగు,బలహీన వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, నాయకులు చావా నారాయణ రావు, నాగులుమీరా తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలను మద్దతు కోరిన తుమ్మల..
శుక్రవారం సందర్భంగా ఖమ్మం నగరంలోని మోతీ మసీద్ లో మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాజీ శాసనసభ్యులు యూనిస్ సుల్తాన్ తో కలిసి నమాజ్ తర్వాత ముస్లిం సోదరులను కలిసి మద్దతు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ముస్లిం సమాజం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న ముస్లిం డిక్లరేషన్ ప్రవేశపెట్టిందని, ప్రతి సంక్షేమ పథకాన్ని ముస్లింలకు అమలు చేసే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు జావీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హుస్సేన్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
క్రిస్టియన్ మైనారిటీలకు అండగా ఉంటా
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రిష్టియన్,మైనారిటీలకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని యస్సార్ కన్వెన్షన్ సెంటర్లో రఘునాథ పాలెం మండలం ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగిన దైవ జనుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ఖమ్మంలో జరుగుతున్న అరచకపాలన అంతం కోసం దైవ జనులు ప్రార్థనలు చేయాలని, కొంత మంది దుర్మార్గుల చేత ఆక్రమణకు గురైన చర్చీల స్థలాలను తిరిగి వారికి చెందేలా చేస్తానని హామీనిచ్చారు. ఫాస్టర్స్ కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాల్, సమాధుల తోట నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, తుంపాలా కృష్ణ మోహన్, గరికపాటి ఆంజనేయ ప్రసాద్, బి.ఆనందరావు, కొమ్ము బాబురావు, జగన్, గుర్రం యేసు రత్నం, ఇస్మాయిల్ తదితర ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.