కొట్లాడతా.. పనిచేస్తా.. ఈ రెండే నాకు తెలుసు: MP ఈటల కీలక వ్యాఖ్యలు
ప్రజల సమస్యల కోసం కొట్లాడడం.. చేతనైనంతలో పనిచేసి పెట్టడం.. ఈ రెండే తనకు తెలిసిన బాధ్యతలని, వాటి కోసమే ప్రజా జీవితంలో
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల సమస్యల కోసం కొట్లాడడం.. చేతనైనంతలో పనిచేసి పెట్టడం.. ఈ రెండే తనకు తెలిసిన బాధ్యతలని, వాటి కోసమే ప్రజా జీవితంలో ఉన్నానని, ఇరవై ఏండ్లుగా ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానిచారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాల్సిన పనులతో ఎక్కువసేపు మాట్లడలేకపోయానని, కడుపు నిండా మాట్లాడిపోదామనే ఇప్పుడు ఇక్కడకు వచ్చానని అన్నారు. కూకట్‌పల్లి మైత్రీనగర్ స్థానికుల కృతజ్ఞతా సభలో బుధవారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మాటలు చెప్పడం, హామీలు ఇవ్వడం తనతోటి అయ్యేపని కాదని, చేసే పనే మాట్లాడుతుందన్నారు. ఈ సిద్ధాంతాన్నే నమ్ముకున్నవాడినని వివరించారు. ‘నాట్ పాజిబుల్’ అనే పదం తన డిక్షనరీలోనే లేదన్నారు.
ఏ సమస్య అయినా తగిన పరిష్కారమార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్ద మల్కాజగిరి లోక్‌సభ స్థానం నుంచి ప్రజలు తనను దీవించి పార్లమెంటుకు పంపారని, చరిత్రలోనే నిలిచిపోయేలా తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ ఎవరు.. అని ప్రశ్నించుకుంటే ఈటల రాజేందర్ అని గర్వంగా చెప్పుకునేలా, ఈ నియోజకవర్గానికి ఒక ఫేస్ వ్యాల్యూ, బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిపేందుకు ప్రయత్నం చేస్తానని భరోసా కల్పించారు. ఐదేళ్ల కాలంలోనే పలుచబడిన ఎన్నో రాజకీయ పార్టీలను చూశామని, పదేళ్లలో కనుమరుగైన అనేక పార్టీలను కూడా చూశామని గుర్తుచేసిన ఈటల రాజేందర్.. 1962 తర్వాత దేశంలో వరుసగా మూడోసారి గెలిచింది ఎన్డీఏ ప్రభుత్వం, దానికి దిక్కుగా మారిన మోడీకే దక్కుతుందన్నారు.
ప్రపంచంలో పది దేశాల తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, అంతటితోనే సరిపెట్టుకోకుండా మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలన్నదే మోడీ తపన అని అన్నారు.