కేబినెట్ బెర్త్ దక్కేదెవరికి..? బ్రదర్స్ లాబీయింగ్ పని చేస్తుందా..?

ఈ పక్షం రోజుల్లోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న బలమైన ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పైరవీలు మొదలుపెట్టారు.

Update: 2024-11-24 04:06 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఈ పక్షం రోజుల్లోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న బలమైన ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పైరవీలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దీపా దాస్ మున్షి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సహా పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఎమ్మెల్యేలు పడ్డారు. మరోవైపు జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ అగ్రనేతల మద్దతు కోసం ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు రోజులుగా మంత్రివర్గ విస్తరణపై జోరుగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఇప్పటిదాకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేబినెట్లో చోటు లేని కారణంగా ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.

లాబీయింగ్ మొదలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ఉన్నారు. పశ్చిమ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు ఒక్కరు మాత్రమే ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక తూర్పు జిల్లాలో మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గాల సభ్యులు దివంగత కాంగ్రెస్ నేత జి వెంకటస్వామి తనయులు గడ్డం వివేక్, గడ్డం వినోద్ లు ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో ముగ్గురు శాసనసభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయస్థాయిలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులతో కేబినెట్ ఖాయం చేసుకునేందుకు ఎవరికి వారుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

తెరపైకి బలంగా ప్రేమ్ సాగర్ పేరు..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ తర్వాతి క్రమంలోనూ పార్టీని వదలకుండా కొనసాగుతున్న మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావు పేరు తాజా మంత్రివర్గ విస్తరణలో బలంగా వినిపిస్తున్నది. పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారుతున్న సమయంలో ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. ఆర్థికంగా కూడా పార్టీకి విపరీతంగా అండగా ఉన్నారన్న పేరు కూడా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రేమ్ సాగర్ రావు ను మంత్రిని చేస్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు మంచిర్యాల ఎన్నికల ప్రచార సభలో బలమైన హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తో కొంత విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ హై కమాండ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే ప్రేమ్ సాగర్ రావు కు అవకాశం కల్పించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది. అందులోనూ ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండున్నర దశాబ్దాలుగా పార్టీలో అనుచర గణం కూడా ఉంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు ఉమ్మడి జిల్లాలో బలంగా వినిపిస్తున్నది.

సామాజిక వర్గ కోణంలో బొజ్జు...

ఆదిమ గిరిజన తెగలకు చెందిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పేరు కూడా ప్రచారంలోకి వస్తున్నది. గోండు సామాజిక వర్గానికి చెందిన ఆయన విద్యావంతుడిగా పేరుంది. ఆర్థికంగా అణగారిన కుటుంబాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ఏకంగా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించాడన్న పేరు ఆయనకు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తో నేరుగా బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు. తూర్పు జిల్లాలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ పశ్చిమ జిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. తాజాగా కేబినెట్ విస్తరణ ప్రచారం నేపథ్యంలో ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

పట్టు వదలని గడ్డం బ్రదర్స్...

కేబినెట్ విస్తరణలో తమలో ఒకరికి మంత్రి పదవి అవకాశం కోసం దివంగత నేత గడ్డం వెంకటస్వామి తనయుడు గడ్డం వివేక్, గడ్డం వినోద్ పట్టు వదలకుండా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండడం... ఆ తరువాత వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ కు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా అవకాశం ఇవ్వడం వల్ల మరోసారి ఆ కుటుంబం నుంచి మంత్రి పదవి కల్పించడం సహేహితుకం కాదన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఒకే కుటుంబంలో కీలకమైన మూడు పదవులు ఉండగా... మంత్రి పదవి అవకాశం ఇస్తే పార్టీ వర్గాల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు. అయితే గడ్డం వివేక్ బిజెపిలో కీలక నేతగా ఎదిగిన సందర్భంలో ఆయనను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే సమయంలో మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు కూడా ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇది ఏ మేరకు సాధ్యం అవుతుందోనన్న సంశయం వారి వర్గీయుల్లో నెలకొంది. త్వరలోనే జరగనున్న మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ వర్గాలతో పాటు ఉమ్మడి జిల్లా వాసుల్లో నెలకొంది.


Similar News