Weather Report: చలి పంజా..! రోజు రోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
రోజురోజుకూ గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను వణికిస్తున్నాయి.
దిశ, తాండూరు : రోజురోజుకూ గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను వణికిస్తున్నాయి. జిల్లాలో 12.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాండూరులో కాగ్నా నది, చెరువులు వాగులు ఉన్న ప్రాంతాల్లోని వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడం, వ్యాధులు సైతం విజృంభిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తగ్గుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు చలికాలం ప్రారంభంతో నవంబరు మొదటి, రెండు వారల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వికారాబాద్ జిల్లాలో వరుసగా రెండు రోజులు 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 9గంటల వరకు చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చలి కారణంగా మార్నింగ్ వాకర్స్ తమ వ్యాయామ వ్యాపాకాలను సాయంత్రానికి మార్చుకుంటున్నారు. ఈసారి వర్షాలు అధికంగా కురిసినందున మున్ముందు చలి తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. చలి ఉన్నా బయటకు రాక తప్పని వారు చలిగాలుల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేక పోతే అనారోగ్య ముప్పు పొంచివుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి కాలం పొంచివున్న రోగాలు చలి తీవ్రతతో మానవులపై వ్యాధుల దాడి పొంచి ఉంటుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. చలికాలంలో న్యూమోనియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, చర్మ వ్యాధుల భారిన ఎక్కువగా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు, ఆయాసం ఎక్కువగా ఉన్నవాళ్లు చల్లటి గాలులకు తిరగక పోవడమే మంచిది. దుమ్ము, దూళీ, పొగ మంచులో బయటకు వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు. ప్రయాణాలు చేసేప్పుడు గాలి తీవ్రత ఇబ్బందులకు గురిచేయనుంది. చలిగాలులు సోకడంతో రక్తనాళాలు మూసుకుపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
చల్లగాలి నుంచి రక్షణకు చెవులు, నోరు, ముక్కు కప్పిపుచ్చే విధంగా మాస్క్‌లు, స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించడం ఎంతో మేలని సూచిస్తున్నారు. వాతావరణంలో తేమ వైరస్‌కు శక్తిని ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. టైఫాయిడ్, వైరల్ జ్వరాలు తీవ్రమవుతాయని అంటున్నారు. జలుబు, దగ్గు జ్వరం ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు. ఇబ్బంది పడుతున్న చిన్నారులు, వృద్ధులు చలి తీవ్రతతో చిన్నారులు, వృద్ధులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, కూలీలు, కార్మికులకు సైతం చలిపులి కష్టాలు తప్పడం లేదు. ప్రధాన రహదారుల్లో వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట మంచుతెరలు కమ్ముకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తప్పని సరిగా విధులు నిర్వహించాల్సిన ఇంటింటికి పాలు, పేపర్ పంపిణీ చేయాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, రాత్రి చలి తీవ్రతను తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు, తెల్లవారుజామున ఉన్ని దుస్తులు ధరించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.