తెలంగాణ శాసనమండలి ఆమోదించిన బిల్లులివే
శాసనమండలిలో మంగళవారం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలిలో మంగళవారం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ముందుగా తెలంగాణ శాసన మండలిలో విద్యా, ఉద్యోగ నియామకాలతోపాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టారు. సభలో ఈ బిల్లులపై జరిగినలో చర్చలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలతోపాటు ఇతర సభ్యుల మొత్తం 16 మంది సభ్యులు చర్చలో మాట్లాడారు. ఈ బిల్లులలో ఉన్న అంశాలు, అనుమానాలు, సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. అనంతరం ఈ రెండు బిల్లులను శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. రెండు బీసీ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, సభ్యులు, ప్రభుత్వానికి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బీఆర్ఎస్ సభ్యులు సత్యవతిరాథోడ్, మధుసూదనచారి, తాతామధు, కవిత, కాంగ్రెస్ సభ్యులు బల్మూరు వెంకట్, ఎంఎస్.ప్రభాకర్ రావు చర్చలో పాల్గొన్నారు. చర్చల్లో సభ్యుల లేవనెత్తిన అంశాలకు మంత్రి దామోదర రాజనర్సింహా సమాధానం చెప్పారు. అనంతరం శాసనమండలి ఎస్సీ వర్గీకరణకు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతోపాటు వైటీడీ బిల్లును శాసనమండలిలో మంత్రి కొండా సురేఖ ప్రశపెట్టారు. ఇది వైటీడీ ట్రస్టు బోర్డుగా పరగణించబడుతుందని ఆమె తెలిపారు. దీనిపై జరిగిన చర్చలో సభ్యులు శేరి సుభాష్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఎంఎస్.ప్రభాకర్ రావు పాల్గొన్ని సూచనలు చేశారు. వీటన్నింటికి మంత్రి కొండా సురేఖ సమాధానం చెప్పారు. అనంతరం శాసనమండలి ఈ బిల్లును ఏకగీవ్రంగా ఆమోదించింది.