ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు.. జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సవాల్
నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తున్న దుద్దిళ్ళ కుటుంబం దళితులకు చేసిన మేలు ఏమిటో సమాధానం చెప్పాలని జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
దిశ, మంథని : నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తున్న దుద్దిళ్ళ కుటుంబం దళితులకు చేసిన మేలు ఏమిటో సమాధానం చెప్పాలని జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. మంథని అంబేద్కర్ నగర్ ను శుక్రవారం ఉదయం ఆయన సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల పాటు ఎమ్మెల్యే పదవులు అనుభవించిన దుద్దిళ్ల కుటుంబం దళితులను ఏనాడు గౌరవించలేదన్నారు. అంబేద్కర్ నగర్ లో కనీసం ఒక్క ఇళ్ళయినా కట్టించారా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ నగర్ పక్కనే ఉన్న బర్రె కుంట మురికి కూపంగా మారితే ఎన్నడూ పట్టించుకోలేదన్నారు.
అంబేద్కర్ నగర్ కనీసం దళితులను గౌరవించలేదని, ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు కూడా బ్రాహ్మణ పురోహితులు రావడం లేదన్నారు. నియోజకవర్గంలో అధిక శాతం ఎస్సీ, బీసీ మైనార్టీలు ఉన్నప్పటికీ తక్కువ శాతం ఉన్న బ్రాహ్మణ కుటుంబానికి అధికారం కట్టబెడితే చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎస్సీ, బీసీ, మైనార్టీ నాయకులు తనను తిట్టడం మాని దుద్దిళ్ల కుటుంబం ప్రజలకు చేసిందేమీ లేదని తెలుసుకోవాలన్నారు. గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి దళిత గోవిందం పేరుతో వెంకటేశ్వర స్వామిని దళిత వాడలకు తీసుకెళ్లారని, అలాంటి మంచిపని ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. ఇంకా దళితులను అంటరాని వాళ్ళుగా చూడడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కొండ శంకర్, పీఏసిమసీఎస్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ అనంతరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ కుమార్, కౌన్సిలర్లు బానయ్య, వీకేరవి, నాయకులు యాకూబ్, గట్టయ్య, పాపారావు తదితరులు పాల్గొన్నారు.