అంగన్వాడీ కోడిగుడ్లలో పురుగులు

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామ అంగన్వాడీ ద్వారా పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు బయటపడ్డాయి.

Update: 2024-10-02 12:17 GMT

దిశ, జగిత్యాల/మేడిపల్లి : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామ అంగన్వాడీ ద్వారా పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు బయటపడ్డాయి. అంగన్వాడీ సెంటర్ నుండి కోడిగుడ్లను ఇంటికి తెచ్చి చూడగా లార్వా తరహా పురుగులు కనిపించడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు. గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేసే పౌష్టికాహారం ఇదేనా అంటూ సంబంధిత అధికారుల తీరుపై మండిపడ్డారు.

    లార్వా పురుగులు ఉన్న గుడ్లను అంగన్వాడీ సెంటర్ కి తీసుకెళ్లి నిలదీశారు. ఇలాంటి గుడ్లని ఉడికించి పిల్లలకి పెడుతున్నారా అంటూ అంగన్వాడీ టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లను తీసుకెళ్లడానికి వచ్చిన సమయంలో అంగన్వాడీ కేంద్రంలో ఎలుకలు కూడా గుర్తించినట్లు ఓ చిన్నారి తండ్రి తెలిపాడు. నిల్వ ఉంచిన గుడ్లను సరఫరా చేయడంతోనే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. గుడ్లు నిల్వ ఉంచకుండా పీకాక్ గ్రీన్, పింక్ కలర్ స్టాంపింగ్ విధానం ద్వారా పంపిణీ చేస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం అనుమానాలకు తావునిస్తుంది.

ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం..అంగన్వాడీలపై కొరవడిన పర్యవేక్షణ

కోడిగుడ్ల సైజు నాణ్యత విషయంలో ఐసీడీఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత శాఖలోని కొందరు ఆఫీసర్లు గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లతో చేతులు కలపడంతోనే నాణ్యతలేని చిన్న సైజు గుడ్లు సరఫరా అవుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం సంగతి అటుంచితే ఇలాంటి ఘటనల నేపథ్యంలో అంగన్వాడీలకు రావాలంటేనే జంకుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లాలోని అంగన్వాడీలకు సరఫరా చేసే కోడిగుడ్లలో పరిమాణం, నాణ్యత లోపించిందని నాలుగు రోజుల కిందంటే "దిశ" కథనాన్ని ప్రచురించింది. 

Tags:    

Similar News