సబ్ స్టేషన్ ఎదురుగా మహిళా ఆత్మహత్యాయత్నం
సంవత్సరాలు గడిచిన బాధితురాలకు న్యాయం జరగడం లేదు. 11 కె.వి. విద్యుత్ కనెక్షన్ తమ ఇంటి పైనుంచి.. woman attempts suicide
దిశ, మల్లాపూర్: సంవత్సరాలు గడిచిన బాధితురాలకు న్యాయం జరగడం లేదు. 11 కె.వి. విద్యుత్ కనెక్షన్ తమ ఇంటి పైనుంచి తొలగించండి బాబో అని బాధితురాలు వేడుకున్నా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. మండలంలోని కొత్త దామరాజుపల్లి గ్రామంలో ఏలేటి నర్సారెడ్డి గంగు దంపతుల కూతురు ఏలేటి లక్ష్మికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. లక్ష్మికి కేటాయించిన ఇంటి స్థలంలో 11 కేవీ విద్యుత్ కనెక్షన్ ఉండడంతో అధికారులకు విద్యుత్ తీగలను తొలగించాలని లక్ష్మి విజ్ఞప్తి చేసింది. అధికారులు మాత్రం పట్టించుకోలేదు. శనివారం లక్ష్మి సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా సంబంధిత విద్యుత్ అధికారి అడ్డుకున్నాడు.
విద్యుత్ వైర్లను తొలగించాలని వేడుకున్నా పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొన్నది.11 కేవీ లైన్ ఇంటి పైభాగానికి రెండు మీటర్ల తేడాతో ఉండడంతో బాధితురాలి ఇంట్లో కరెంట్ షాక్ వస్తుందన్న భయంతో, అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదని మనస్తాపానికి గురైంది. లైన్ తొలగించడానికి డబ్బులు అడిగినట్టు బాధితురాలు పేర్కొన్నది. లక్ష్మి తల్లిదండ్రులు మరణించడంతో బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. అంత డబ్బు ఎలా ఇవ్వాలని బాధితురాలు వాపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఈ వినీత్ రెడ్డికి బాధితురాలు లక్ష్మి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుచున్నారు.