సీఎం పర్యటనతో ఈ ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుంది : వేములవాడ ఎమ్మెల్యే
ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
దిశ,వేములవాడ : ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనతో ఈ ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం వేములవాడ పర్యటన నేపథ్యంలో సోమవారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 20 బుధవారం రోజున ఉదయం 10.30గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకుంటారని, పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తారని, అనంతరం గుడి చెరువు పార్కింగ్ ప్రదేశం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్నట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి,విస్తరణ చేపడుతున్నామని, 2023-24 బడ్జెట్ లో రాజన్న ఆలయానికి రూ. 50 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని, కేసీఆర్ గతంలో ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని మోసం చేసి రంగు రంగుల బ్రోచర్లతో కాలం వెల్లదీస్తే, తాము ఎక్కడ చెప్పకున్నా అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే ఆలయం, పట్టణ అభివృద్ధికి, ఇప్పటికీ రూ.127 నిధులు కేటాయించి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్లే క్రమంలో వేములవాడకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికేందుకు జిల్లాలోని పట్టణాల నుండి గ్రామాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.