హుజురాబాద్ కేంద్రంగా కల్తీ నెయ్యి తయారీ
హుజురాబాద్ పట్టణంలోని కొత్తపల్లి శివారులో కల్తీ నెయ్యి తయారు
దిశ,హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలోని కొత్తపల్లి శివారులో కల్తీ నెయ్యి తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నెయ్యి తయారీ కేంద్రాన్ని "దిశ" గుర్తించింది. ఆ ప్రాంతానికి వెళ్లగా కల్తీ వ్యవహారం కళ్లకు కట్టినట్టు కనిపించింది. కంపెనీ నిర్వహించే నిర్వాహకుడు నాగేశ్వరరావును నెయ్యి తయారీలో ఎలాంటి ముడిసరుకు వాడుతున్నారని ప్రశ్నించగా తడబడ్డాడు. ఫోటో తీయడానికి ప్రయత్నిస్తే తీయకూడదని తిరగబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి... హుజురాబాద్ పట్టణ శివారులోని కొత్తపల్లి ప్రాంతంలో కల్తీ నెయ్యి వ్యాపారం జోరుగా సాగుతుంది.ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏకంగా బోర్డు పెట్టి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా నిర్వహిస్తున్నాడు.
నెయ్యి తయారీ విధానంలో డాల్డా, పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు నెయ్యి ఫ్లేవర్ రంగు రుచి కోసం ఆరోగ్యానికి హాని కలిగించే వివిధ రసాయనాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తయారు చేసినా కల్తీ నెయ్యిని రెస్టారెంట్లు, స్వీట్ హాజులు, దేవాలయాలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొన్ని అనుష్ కంపెనీ పేరుతో ముద్రించిన కవర్లలో ఆఫ్ లీటర్ ,లీటర్ నెయ్యిని ప్యాకింగ్ చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ దందా గత కొన్నేళ్లుగా సాగుతున్న మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నామమాత్రంగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకొని గత కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
పొయ్యి వెలగకుండానే నెయ్యి తయారీ...
డైరీ సంస్థల నుంచి వెన్న కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు ఎలాంటి మ్యాన్ ఫ్యాక్చర్ లేకుండానే ఇక్కడ నెయ్యి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ తయారవుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ ప్యాకింగ్ మిషన్ ను ఏర్పాటు చేసి ఏలాంటి లేబుల్ లేని కవర్లలో నింపుతూ దుకాణాలకు విక్రయిస్తున్నారు. లేబుల్ లేని ప్యాకెట్లను స్వీట్ హౌస్ ,రెస్టారెంట్లు దేవాలయాల వద్ద సామాగ్రిని విక్రయించే దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. లేబుల్తో ప్యాకింగ్ చేసే కవర్లను కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తే ఇక్కడ నెయ్యి తయారు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడం శోచనీయం.
అంతా కల్తీమయం...
నేడు వంటిల్లు అంతా కల్తీ అవుతుంది. తినే ప్రతి ముద్దలో అవే జాడలు కనిపిస్తున్నాయి. పప్పులో వాడే నెయ్యి, కూరలో వాడే పసుపు, మసాలాలు, ధనియాల పొడి ఇలా అన్ని కల్తీ అయితే ఇక మనిషి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఒకేసారి కనిపించకపోయినా క్రమేనా ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కల్తీ నెయ్యి మనిషి శరీరానికి ఎంతో హాని చేకూరుతుందని వారు పేర్కొంటున్నారు.
పట్టించుకోని అధికారులు..
పట్టణ శివారులో కల్తీ నెయ్యి అక్రమ దందా గత కొన్నేళ్లుగా సాగుతున్న మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం సోషనీయం. కల్తీ పదార్థాల తో నెయ్యి తయారీ గురించి సంబంధిత అధికారులకు తెలిసిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కల్తీ నెయ్యి వ్యవహారం అధికారులకు తెలిసిన తయారీదారు నుంచి మామూలు దండుకుంటున్నట్లు తెలుస్తోంది.