యావర్ రోడ్డు అంశం ఇన్నాళ్లు ఎందుకు పెండింగ్ లో ఉంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే యావర్ రోడ్డు విస్తరణ చేపడుతామని చెప్పి ఇంతకాలం ఎందుకు పెండింగ్ పెట్టారని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే యావర్ రోడ్డు విస్తరణ చేపడుతామని చెప్పి ఇంతకాలం ఎందుకు పెండింగ్ పెట్టారని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 2018లో యావర్ రోడ్డు విస్తరణ ఎన్నికల అంశంగా మారిందని, కానీ గెలిచిన తర్వాత ఆ పార్టీ నాయకులు ఆ విషయాన్ని పక్కకు పెట్టారని అన్నారు.
రోడ్డు విస్తరణ అంశాన్ని పలు సందర్భాలలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించినప్పటికీ విస్తరణ జరగలేదని అన్నారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట మాత్రమే రోడ్డు విస్తరణ చేపట్టి మిగిలింది అలాగే వదిలేశారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టణ ప్రజల నుండి నిరసనలు వ్యక్తం కాకూడదని తెరపైకి టీడీఆర్ సౌకర్యం తీసుకువచ్చారని విమర్శించారు. టీడీఆర్ కు తాను వ్యతిరేకం కాదని అయితే నిజంగా రోడ్డు విస్తరణ పై చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్ల క్రితమే టీడీఆర్ సౌకర్యం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 40 ఫీట్లు ఉన్న రోడ్డును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరిని ఒప్పించి 60 ఫీట్లకు పెంచామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా యావర్ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గిందని అన్నారు. ఇక మరోవైపు మాస్టర్ ప్లాన్ కత్తి రైతుల మెడపై వేలాడుతూనే ఉందని అన్నారు. మాస్టర్ ప్లాన్ ఉపసంహరణ కేవలం తాత్కాలిక ఉపశమనమే అని మళ్లీ దానిని పునః సమీక్షిస్తామని జీఓలో పేర్కొన్నట్లుగా గుర్తు చేశారు.
నాలుగు దశాబ్ధాలుగా ప్రజా జీవితంలో జగిత్యాల అభివృద్ధికి చేయాల్సినంత చేశామని, మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ జీవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.