తిరుమల తరహాలో కరీంనగర్ లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల అంకుర్పాణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

Update: 2023-05-21 09:59 GMT

18నెలల్లో ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతాం

31న భూమి పూజ నిర్వహిస్తాం, ఆలయం మొత్తం రాతి కట్టడమే..

అదే రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం

దిశ, కరీంనగర్ : కరీంనగర్ శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల అంకుర్పాణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. 31న ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసినప్పటికీ... 22న సోమవారం భూకర్షణం కార్యక్రమంతో ఆలయ నిర్మాణ పనులకు అంకురార్పణ చేయనున్నారు. ఆలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంపై టీటీడీ క్షేత్ర ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర టీటీడీ అధికారులతో కరీంనగర్ లో సమావేశమైన బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ... కరీంనగర్ శ్రీవారి ఆలయాన్ని 18 నెలల్లోగా గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఈ సోమవారం భూకర్షణం కార్యక్రమంతో ఆలయ నిర్మాణ పనులకు అంకురార్పణ చేస్తామన్నారు. అదేవిధంగా 31న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, అదే రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనన్న మంత్రి గంగుల తెలిపారు. ఈ పవిత్ర కార్యంలో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమమని, ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు.

ఆలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి అందరూ ఆహ్వానితులేనని, పార్టీలకతీతంగా తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ లను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆలయం మొత్తం రాతి కట్టడంతో ఉంటుందని... అందుకు సబంధించిన రాయిని తమిళనాడు నుంచి తీసుకువస్తామన్నారు.

కలియుగంలో భక్తులను రక్షించేందుకే శ్రీవారు ఉద్భవించారు...

ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. కలియుగంలో భక్తులను రక్షించేందుకే శ్రీవారు తిరుమలలో వెలిశారని తెలిపారు. స్వామి వారి అనుగ్రహం ఉండటం వల్లే కరీంనగర్ లో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయని తెలపారు. ఆలయ నిర్మాణ పనులకు 31న శంకుస్థాపన చేయనున్నప్పటికీ, వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ నెల 22న సోమవారం ఉదయం మిథున లగ్నంలో భూకర్షణం చేసిన పనులకు అంకురార్పణ చేస్తున్నట్లు ఆయ తెలిపారు

. 31న ఉదయం 6 గంటలకు ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమై 7.20 గంటలకు నిమిషాలకు ముగుస్తుందన్నారు. అదే రోజున సాయంత్రం ఆలయ నిర్మాణ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నామని తెలపారు. తిరుమల, తిరుపతి క్షేత్రంలో స్వామి వారికి ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపడుతారో అలాంటి సేవలను కరీంనగర్ శ్రీవారి ఆలయంలో చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లాహరిశంకర్, టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమశాస్త్ర నిపుణులు మోహనరంగా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి పలువురు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News