TG News : తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం
తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavvampalli Satyanarayana), బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Ex MLA Rasamayi Balakishan) మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి బాలకిషన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ముందుగా దమ్ముంటే చర్చకు రావాలని, దాక్కునే వైఖరి తనది కాదంటూ కవ్వంపల్లి ట్వీట్ చేయగా.. హైదరాబాద్లో దాక్కున్నది నువ్వే అంటూ కవ్వంపల్లికి రసమయి కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల వార్ మొదలైంది. ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్లో భారీగా అక్రమాలు చేస్తున్నారని, కమీషన్ల కోసం ఎమ్మెల్యే పాత కాంట్రాక్ట్ పనులకు రద్దు చేశారని మండిపడ్డారు. కవ్వంపల్లి అవినీతి చిట్టా తన దగ్గరుందని, దమ్ముంటే క్వాంప్ ఆఫీస్కి రావాలని, చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు రసమయి సవాల్ విసిరారు.
అదేవిధంగా కవ్వంపల్లి అవినీతిపై త్వరలోనే మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. దీనిపై స్పందించిన కవ్వంపల్లి సత్యనారాయణ.. కమీషన్లు తీసుకోవడం రసమయికి అలవాటని, ఆరోపణ చేయడం కాదు.. ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. త్వరలోనే రసమయి దండుకున్న కమీషన్ల చిట్టా బయట పెడతానని, రాజకీయ పదవులకు కూడా డబ్బులు తీసుకున్న చరిత్ర రసమయిదని మండిపడ్డారు.ఎల్వోసీలు ఇప్పించి డబ్బులు దండుకున్నది మర్చిపోయారా అని నిలదీశారు. ఎన్నికల అఫిడవిట్లోనే రూ.100 కోట్ల ఆస్తి ఉన్నట్లు చూపించానని, తనకి పీఏలు లేరని, అందరితో తానే మాట్లాడతానని కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.