డీలిమిటేషన్ పై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: ఎంపీ ఈటెల
డీలిమిటేషన్ మీద ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు, పిల్ల పుట్టకముందే కుళ్ళ కుట్టినట్టు ఉంది ప్రతిపక్షాల తీరుఉందని ఎంపీ ఈటెల రాజేందర్విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : డీలిమిటేషన్ మీద ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు, పిల్ల పుట్టకముందే కుళ్ళ కుట్టినట్టు ఉంది ప్రతిపక్షాల తీరు అని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలను కేంద్రప్రభుత్వం మీద ఎగదోసి పబ్బం గడుపుకొనే ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు. వీరికి నిజాయితీ, చిత్తశుద్ధి లేదు. స్వార్థ రాజకీయాలకోసం రెచ్చగొడుతున్నారని వీరికి నీతి జాతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకే తాను ముక్కలు అధికారం కోసం అర్రులు చాచే వాళ్లు అని, బీజేపీ ప్రజలకోసం ఆలోచన చేస్తే వీళ్లు సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారని పేర్కొన్నారు. జనాభా నియంత్రణ చేసిన దక్షిణ భారతదేశ రాష్ట్రాలకి ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప, నిరుత్సాహపరిచే విధంగా ఉండవని, ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మాట్లాడడం మంచిపద్దతి కాదన్నారు. కేంద్రం విధి విధానాలు ప్రకటించినప్పుడు మాట్లాడితే మంచిదని, దేశ పురోగమనంలో పాలుపంచుకోవాలని పిలుపునిస్తున్నామన్నారు.
దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశం కోణంలో ఆలోచన చేయాలి తప్ప సంకుచిత ఆలోచన చేయవద్దని, కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. బీజేపీ ప్రోగ్రసివ్ గా ఆలోచిస్తిందని ప్రోగ్రసివ్ స్టేట్స్ కి మద్దతుగా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాలను నమ్మి సభలు పెట్టడం సరికాదన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేసి కుప్పకూలిపోయిందని, తెలంగాణలో కూడా ఈ అబద్ధపు ప్రచారాలు నిలవరించే ప్రయత్నం చేశామన్నారు. గొప్ప రాష్ట్రంగా ఉన్న కర్ణాటకని కాంగ్రెస్ ఖతం పట్టించిందని, రాష్ట్రాలను దిగజార్చి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసి అప్పులు పుట్టని రాష్ట్రాలలుగా చేశారని మండిపడ్డారు. అదిలాబాదు పార్లమెంట్ లో 14 లక్షల ఓట్లు ఉన్నారని, మల్కాజిగిరిలో 38 లక్షల ఓట్లు ఉన్నారని, పట్టణీకరణ చాలా వేగంగా జరుగుతుందని,ఈ అంతరాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు. ఆ శక్తి ఎవరికీ లేదు సాధ్యం కాదని తెలిసినా కూడా మోసకారులు, డిలిమిటేషన్ మీద చేస్తున్నది తప్పుడు ప్రచారం, మోసపు మాటలు నమ్మవద్దని సూచించారు.
ఓటమి భయంతో స్టాలిన్విభజన కుట్రలు : ఎంపీ అరవింద్
తమిళనాడు ఎన్నికలలో డీఎంకే పార్టీ ఓడిపోబోతుందని, అందుకే డీలిమిటేషన్ పై సీఎం స్టాలిన్అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ మండి పడ్డారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన దక్షిణ భారత దేశం వెనుకబడి పోతుందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ తతో తమిళనాడుకు కొద్దిమేర మాత్రమే నష్టం జరుగుతుంది. తమిళనాడు మినహా దేశంలో, ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర అంశాన్ని మాత్రమే బూచిగా చూపి దక్షిణాదికేదో జరుగుతున్నట్టు స్టాలిన్ ప్రచారం చేయడం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమేన్నారు. 1971 దేశ జనాభా 41 కోట్లు ఉంటే, ఇప్పుడు సుమారు 140 కోట్లకు పెరిగింది. దేశంలో ముస్లిం జనాభా ఏడువందల శాతం పెరిగింది. హిందువుల జనాభా 300 శాతం పెరిగింది. అసలు సమస్య ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు కాదని, దేశంలో ముస్లింల సంఖ్య పెరగడమే వ్యాఖ్యానించారు.
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మరు : ఎంపీ లక్ష్మణ్
కాంగ్రెస్పార్టీ ఉనికి రోజు రోజుకు పడిపోతుండటంతో ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు డిలిమిటేషన్పేరుతో డిఎంకె, బీఆర్ఎస్ వంటి పార్టీలను వాడుకుంటుందని ఎంపీ లక్ష్మణ్ఆరోపించారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పెంపుకు సంబందించిన ప్రక్రియ ప్రారంభించలేదని, ఎందుకు విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయో అర్ధంకావడం లేదన్నారు. గతంలో ఈ పార్టీలే కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశాయి. వాటిని ప్రజలు నమ్మకపోవడంతో ప్రస్తుతం డీలిమిటేషన్ కింద దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ సరికొత్త కుట్రలకు తెరలేపింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ముందు పెట్టి ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య విభజన తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.