హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి..! బీజేపీ నేత రాణి రుద్రమ డిమాండ్
యావత్ హిందూ సమాజానికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: యావత్ హిందూ సమాజానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ (BJP Spokes Person Rani Rudrama) డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో (BJP State Office) మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అయోధ్య (Ayodya) నుంచి అక్షంతలు రాలేదని, రేషన్ బియ్యాన్ని అయోధ్య అక్షింతలు అని చెప్పి పంపిణీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారని, అయోధ్య నుంచి వచ్చింది అక్షింతలా? లేక తలంబ్రాలా? అని కనీసం అవగాహన కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
కేటీఆర్ కు అక్షింతలకు, తలంబ్రాలకు తేడా తెలియదని, అయోధ్యలో ఉన్న బాల రాముడికి, సీతారాముల వారికి తేడా తేలియదని ఎద్దేవా చేశారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యంతో పొల్చి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కేటీఆర్ హిందు సమాజానికి (Hindu Soceity) బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. అలాగే కేటీఆర్ కు రంజాన్ (Ramdan) వచ్చినప్పుడు ముస్లింలను శాంతి పరచాలి కాబట్టి హిందు దేవుళ్లను కించపరచాలి అనే ఆలోచన వస్తుందని మండిపడ్డారు. ఎప్పుడు రంజాన్ వచ్చినా అప్పుడు కేసీఆర్ (KCR), కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) హిందుత్వం మీద, బీజేపీ మీద పడతారని దుయ్యబట్టారు.
ఎన్నికల సమయంలో ముస్లింల ఓట్లు గంపగుత్తగా దండుకునే రాజకీయ కుట్రతో హిందుత్వాన్ని కిందచ పరుస్తారని అన్నారు. 500 సంవత్సరాలైనా రాముడికి గుడి లేదని, పార్టీలకతీతంగా ఎంతో మంది విరాళాలు ఇచ్చి అయోధ్యలో గుడిని నిర్మించుకున్నారని తెలిపారు. ఆ దేవుడి అక్షింతలు తమ మీద వేసుకుంటే దేవుడి ఆశీర్వాదం మనకు లభిస్తుందని అందరూ నమ్మి పండగ చేసుకుంటే కేటీఆర్ లాంటి వాళ్లు హేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ అక్షింతలు పంచితే, దానిని కూడా రాజకీయం చేసే పరిస్థితికి దిగజారిపోయారని బీజేపీ నేత అన్నారు.