ఆ కోపాన్ని బిగపట్టుకున్నా.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

‘మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే.. వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు. చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.

Update: 2025-03-27 15:32 GMT
ఆ కోపాన్ని బిగపట్టుకున్నా.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే.. వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు. చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు. డ్రోన్ ఎగరేస్తే రూ.500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా నిర్బంధించినా ఆ కోపాన్ని బిగపట్టుకున్నా తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు. లైట్లు ఆన్‌లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా చేశారు. కరుడు గట్టిన నేరస్తుడిలాగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు. వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు.. అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఎమోషనల్ అయ్యారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు కేటీఆర్ మాట్లాడగా.. ఆయనకు కౌంటర్‌గా సీఎం మాట్లాడారు.

చర్లపల్లి జైలు నుంచి తన బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారని.. రాజకీయ కక్ష సాధింపు అంటే ఇది కాదా అని ప్రశ్నించారు. అయినా.. తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని.. నిజంగానే తాను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారని అన్నారు. కానీ, ఆ పని చేయలేదని, తాము విజ్ఞత ప్రదర్శించామని చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చింది తన కక్ష తీర్చుకోవడానికి కాదన్నారు. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా.. చెంపలు వాయించే శక్తి ఉన్నా తాను సంయమనమే పాటించానని అన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదని అంటున్నారని.. ఎన్నికలకు ముందు ఆ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాననే హామీ కూడా ఇచ్చానని అన్నారు. కానీ.. ఆ హామీ కూడా తాను అమలు చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రికి ఉన్న విశేష అధికారాలతో ఒక్కరైనా బయట ఉండేవారా అని ప్రశ్నించారు. నాడు మంద కృష్ణమాదిగను, రవిప్రకాశ్‌ను, రేవంత్‌రెడ్డిని ఎవరినీ వదల్లేదన్నారు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తున్నదని అన్నారు.

రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం

తెలంగాణ సమాజం అంటే వ్యవసాయం అని.. వ్యవసాయంపై ఆధారపడిన వారు 70 శాతం ఉన్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక ఏకమొత్తం తాము రుణమాఫీ చేయబోమని, నాలుగు విడతల్లో చేస్తామని చెప్పారని తెలిపారు. రూ.25వేల చొప్పున నాలుగు విడతల్లో చేస్తామని అన్నారని పేర్కొన్నారు. అలా.. 2014 నుంచి 2018 వరకు రూ.16,143 కోట్లు రుణమాఫీ చేశారని.. నాలుగు విడుతలుగా చేసినందుకు మిత్తి కింద దాదాపు రూ.2,630 కోట్లు పోయిందన్నారు. నికరంగా మిగిలింది మొదటి ఐదేళ్లలో... రూ.13,514 కోట్లని వెల్లడించారు. ఈసారి ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పి రెండో సారి అధికారంలోకి వచ్చారని అన్నారు. రెండో విడతలో చేస్తామని చెప్పినా.. మొదటి నాలుగేళ్లలో రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. చివరి ఏడాది రూ.11,999 కోట్లు రుణమాఫీ చేశారని చెప్పారు. ఇందులో మిత్తి కింద రూ.8,515 కోట్లు పోయిందన్నారు.

పదేళ్ల పరిపాలనలో రెండు కలిపి రూ.16,908 కోట్లు రుణమాఫీ చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పది నెలల్లోనే రూ.20,617 కోట్లు రుణమాఫీ చేశామని వెల్లడించారు. పదేళ్లలో మీరు చేసింది ఏంటి.. పది నెలల్లో తాము చేసింది ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రైతుబంధు ఎగనామం పెట్టి పారిపోయారని అన్నారు. ఎన్నికల తరువాత తాము అధికారంలో వచ్చాక రూ.7,625 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. రెండోసారి రూ.4,666 కోట్లు రైతు భరోసా కింద చెల్లించామన్నారు. గతంలో వరి వేసుకుంటే ఉరి అని చెప్పారని.. వాళ్లు మాత్రం ఫాంహౌజ్‌లో పండించుకొని రూ.4,500 క్వింటాల్ చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక వరిని ప్రోత్సహించేందుకు సన్నవడ్లకు రూ.500 బోనస్ ప్రకటించామన్నారు. అలాగే.. చివరి గింజ వరకూ కొంటామని హామీ ఇచ్చామన్నారు. బోనస్ కింద రూ.1,162 కోట్లు చెల్లించామన్నారు. ఉచిత కరెంటుకు బీఆర్ఎస్‌కు సంబంధం లేదని.. ఉచిత కరెంటును అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఉచిత కరెంటు అనే పేటెంట్ కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని చెప్పారు. ఉచిత కరెంటు కోసం రూ.15,333 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతుబీమా కింద రూ.1,555 కోట్లు ప్రీమియం చెల్లించామన్నారు. వాళ్ల కుర్చీ తీసుకున్నందుకు వాళ్లకు తనపై కోపం ఉందని.. కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మెచ్చుకోవాలి కదా అన్నారు.

57,946 నియామకాలు చేశాం..

2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2023 వరకూ 24 శాఖల్లో నియామకాలు చేపట్టలేదని చెప్పారు. నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించలేదన్నారు. వాళ్ల కుటుంబాన్ని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా కారుణ్య నియామకాల పేరిట ఎమ్మెల్సీలు, ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్లను ఇచ్చుకున్నారని ఆరోపించారు. వాళ్ల కుటుంబసభ్యులందరికీ కారుణ్య నియామకాలు చేసుకున్నారని అన్నారు. కానీ.. తాము వచ్చాక కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. 25శాఖల్లో తాము నియామకాలు చేపట్టామని చెప్పారు.

- అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ విభాగంలో 208, యానిమల్ హస్బెండరీ అండ్ డెయిరీ డెవలప్‌మెంట్ అండ్ ఫిషరీష్ విభాగంలో 173, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 5,764, ఎనర్జీలో 850, ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 23, ఫైనాన్స్‌లో 308, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్‌లో 71, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో 5, హెల్త్‌లో 7,517, ఉన్నత విద్యలో 2,361, హోంలో 15,526, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్‌లో 7, ఇరిగేషన్‌లో 1,235, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్‌లో 128, మైనార్టీస్ వెల్ఫేర్‌లో 1,584, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో 3,148, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంటులో 1,232, ప్లానింగ్ డిపార్టుమెంటులో 2, రెవెన్యూలో 3,048, ఎస్సీ విభాగంలో 2,562, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 10,211, ట్రాన్స్‌పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్టుమెంటులో 442, ట్రైబల్ వెల్ఫేర్‌లో 1,413, ఉమెన్ చైల్డ్ అండ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంటులో 115, యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చర్‌లో 13.. మొత్తంగా 57,946 నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ చేసిన అప్పులు రూ.8,19,151 కోట్లు..

తాము సత్యహరిశ్చంద్రులమని.. సత్యహరిశ్చంద్రుడు కూడా తమను చూసే నేర్చుకోవాలని.. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్నారని రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఎఫ్ఆర్‌బీఎం పరిధిలో జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రాన్ని అప్పజెప్పినప్పుడు రాష్ట్రం అప్పు రూ.72,658 కోట్లు ఉందని చెప్పారు. అలాగే.. ఎస్‌పీబీ లోన్స్ రూ.11,609 కోట్లు అని, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ రూ.5,893 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన లోన్స్ సున్నా అని చెప్పారు. వీటన్నింటినీ కలిపితే నాడు రాష్ట్రం అప్పు రూ.90,161 కోట్లు అని వెల్లడించారు. మిగులు బడ్జెట్‌తో వారికి రాష్ట్రానికి అప్పగించినట్లు తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పు వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 1, 2023 వరకు ఎఫ్ఆర్‌బీఎం అప్పులు రూ.3,87,173 కోట్లు అని చెప్పారు. అలాగే.. గవర్నమెంట్ గ్యారంటీ కింద ఎస్‌పీబీ లోన్స్ రూ.1,27,209 కోట్లు, థర్డ్ కేటగిరీ కింద తెచ్చిన లోన్స్ రూ.95,461 కోట్లు, నాన్ గ్యారంటీ లోన్స్ రూ.59,414 కోట్లు అని.. నాలుగు కేటగిరీల కింద రూ.6,69,257 కోట్ల అప్పు తమకు అప్పజెప్పి పోయారని తెలిపారు. వీటితోపాటు పేమెంట్లు పెండింగులో పెట్టారని అన్నారు. పెండింగ్ బిల్స్ రూ.40,154 కోట్లు అని, అదర్ బిల్స్ రూ.1,09,740 కోట్లు అని తెలిపారు. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమకు అప్పజెప్పే నాటికి రాష్ట్ర అప్పు రూ.8,19,151 కోట్లు అని చెప్పారు. రూ.90వేల కోట్లతో అప్పగిస్తే.. పదేళ్లలో రూ.8లక్షల కోట్లతో అప్పగించారన్నారు. మొత్తంగా రూ.7.50 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. తాము ఈ 15 నెలల్లో రూ.1,58,041 కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు. రూ.1,53,359 కోట్లు అప్పులుగా చెల్లించామన్నారు. వారు చేసిన అప్పులకు అసలు రూ.88,591 కోట్లు, మిత్తికి రూ.64,768 కోట్లు చెల్లించామన్నారు. ఇందులో తాము చేసిన అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే అన్నారు.

కార్పొరేషన్ల వారీగా చేసిన అప్పులు..

- కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద రూ.74,590 కోట్లు, నేడు ఆ అప్పు రూ.68,947 కోట్లకు తగ్గించామన్నారు. కూలిపోయిన కాళేశ్వరానికి కూడా తాము రూ.5,643 కోట్లు చెల్లించాం.

- తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద రూ.14,060 కోట్ల అప్పు అప్పగిస్తే.. రూ.12,816 కోట్లు అని తెలిపారు. రూ.1,244 కోట్లు చెల్లించాం.

- తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద రూ.20,200 కోట్లు అప్పు తెచ్చారని.. రూ.17,200 కోట్లకు తగ్గించామని.. రూ.3,000 కోట్లు చెల్లించాం.

- టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.6,470 కోట్ల అప్పు ఉంటే.. నేడు రూ.5,820 కోట్లు ఉందని.. తాము రూ.650 కోట్లు చెల్లించాం.

- టీజీ రోడ్డు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ.2,951 కోట్ల అప్పు చేస్తే.. నేడు రూ.2,646 కోట్ల అప్పు ఉందని, రూ.305 కోట్లు చెల్లించాం.

- హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు ద్వారా రూ.2,352 కోట్లు అప్పు చేస్తే.. రూ.1,830 కోట్లకు చేర్చామన్నారు. రూ.522 కోట్లు చెల్లించాం.

- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను రూ.286 కోట్ల అప్పుతో అప్పగిస్తే.. ఇప్పుడు రూ.263 కోట్లు ఉందన్నారు. రూ.23 కోట్లు చెల్లించాం.

- తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ లిమిటెడ్‌ను రూ.907 కోట్ల అప్పుతో అప్పగిస్తే.. రూ.214 కోట్ల అప్పు ఉందని.. రూ.692 కోట్లు చెల్లించాం.

- ఫిషర్‌మెన్ కార్పొరేషన్ కో ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్‌ను రూ.125 కోట్లతో అప్పగిస్తే.. ఇప్పుడు అప్పు రూ.56 కోట్లు ఉందన్నారు. ఇందులో రూ.69 కోట్లు కట్టాం.

- తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రూ.132 కోట్లతో అప్పగిస్తే.. రూ.79 కోట్లకు తగ్గించామని.. రూ.53 కోట్లు చెల్లించాం.

- టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ను రూ.168 కోట్ల అప్పు అప్పగిస్తే.. ఇప్పుడు రూ.37 కోట్లు ఉందన్నారు. రూ.132 కోట్లు చెల్లించాం.

- మొత్తంగా రూ.1,27,209 కోట్ల అప్పుతో 18 కార్పొషన్లను అప్పగించారని.. ప్రస్తుతం వీటి అప్పు రూ.1,17,109 కోట్లని వెల్లడించారు. 15 నెలల్లో రూ.10,101 కోట్లు చెల్లించాం.

- తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌ను రూ.56,146 కోట్ల అప్పు అప్పగిస్తే.. ప్రస్తుతం రూ.57,824 కోట్లు ఉందని.. ఆన్ టైంలో అన్ని చెల్లించి అదనంగా తాము రూ.1,728 కోట్ల అప్పు చేశాం.

- టీజీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను రూ.1,270 కోట్లతో అప్పగించారని.. ప్రస్తుతం రూ.735 కోట్ల అప్పు ఉందని.. రూ.535 కోట్లు చెల్లించాం.

- జీహెచ్ఎంసీ రూ.1,332 కోట్లతో అప్పగిస్తే.. రూ.1,086 కోట్ల అప్పు ఉందన్నారు. రూ.246 కోట్లు చెల్లించాం.

- డెయిరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను రూ.103 కోట్లతో అప్పగిస్తే.. ఈ రోజు రూ.129 కోట్లు అయిందని.. ఇందులో రూ.26 కోట్లు పెరిగింది.

- తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రూ.12,544 కోట్ల అప్పుతో అప్పగిస్తే.. ప్రస్తుతం ఆ అప్పు రూ.17,209 కోట్లకు పెరిగిందన్నారు. రూ.4,000 కోట్ల అప్పు చేశాం.

- ఎనర్జీని రూ.59,141 కోట్లతో అప్పగిస్తే ఈ రోజు ఆ అప్పు రూ.59,956 కోట్లు ఉందన్నారు. రూ.543 కోట్లు అదనంగా ఉంది.

- బీఆర్ఎస్ చెప్పినట్లుగా తాము రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఉంటే.. నేడు రాష్ట్రం అప్పు రూ.8లక్షల కోట్లకు పైగా ఉండేదని.. కానీ ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.7,38,707 కోట్లు ఉంది.

- యావరేజీగా ప్రతినెలా రూ.10వేల కోట్ల అప్పు తెచ్చి చెల్లించామన్నారు. రాబోయే 45 నెలల్లోనూ వారు చేసిన అప్పుల కోసం రూ.10వేల కోట్ల అప్పు చేయాల్సి ఉంది.

వాళ్లే ఇంజినీరు, సైంటిస్ట్, లాయర్..

ఆస్తులు కూడబెట్టామని అంటున్నారని.. కాళేశ్వరం కాస్త కూళేశ్వరం అయిందన్నారు. ఇంజినీరు, సైంటిస్ట్, లాయర్ అన్నీ వారే అయి నిర్మించారని అన్నారు. 80వేల పుస్తకాలు చదివి కడితే అది కుప్పకూలి పోయిందన్నారు. అందులో నీళ్లు స్టోరేజీ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. తప్పు జరిగిందని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిపోయిన తరువాత కూడా రికార్డు స్థాయిలో ధాన్యం పండించినట్లు చెప్పారు. ఇలాంటి అబద్ధాల పునాదుల మీద మరోసారి గెలవలేరని అన్నారు. పార్టీ కుప్పకూలిన తరువాత కూడా ఇంకా అర్థం చేసుకోవడం లేదన్నారు. ‘వయసు ఉన్నది. మీరిద్దరు ఆ సీటు కోసం ఆశ పడుతున్నారు. ఈ పెద్దమనిషి వదిలేలా లేదు. మేము అందరం కూడా ఆ పెద్దమనిషి ఉంటేనే బాగుంటుంది. వీళ్ల చేతికిస్తే ఏం చేస్తరో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఓ భయం ఉంది. వాళ్ల ఇద్దరి పోటీ తెలంగాణ ప్రజల సావుకొచ్చింది. ఒకాయన పొద్దున్నే ట్విట్టర్‌లో పెడుతడు. 11 గంటలకు ఒకాయన ప్రెస్‌మీట్ పెడుతడు. 4 గంటలకు ఇంకొకరు పర్యటన అని పోయి ఏదేదో అంటరు. వీళ్లందరిని చూసి మేడం సాయంత్రం అందరిని పిలిచి సమావేశం పెడుతుంది’ అని కేటీఆర్, హరీశ్‌రావు, కవితను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు పోటీ పడి పెద్దమనిషికి ప్రమాదం తెచ్చేలా ఉన్నారు. స్పీకర్‌గా మీరు పోలీసోళ్లకు ఏమైనా ఆదేశాలిచ్చి.. వీరికి జ్ఞానోదయం కలిగేలా మంచి మాటలు చెప్పాలని’ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం లేకున్నా మల్లన్నసాగర్‌కు నీళ్లు..

ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఎప్పుడో నిర్మించినవని.. ఈ ప్రాజెక్టులతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రంగనాయక సాగర్‌కు నీరు ఇవ్వొచ్చని రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్ కట్టినవి కూలిపోయినా ఈ ప్రాజెక్టలకు నీరు ఇవ్వచ్చన్నారు. కొల్లగొట్టిన లక్ష కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టు గుండుసున్నా అయినా నీళ్లు ఇవ్వచ్చన్నారు. తప్పుదారి పట్టించొద్దని సూచించారు. ప్రతీ ప్రాజెక్టు పక్కన వందల ఎకరాల భూములు కొన్నారా లేదా అని ప్రశ్నించారు. ఫాంహౌజ్‌లు నిర్మించుకున్నారని అన్నారు. కొండపోచమ్మ నుంచి ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు కాలువలు నిర్మించి.. వందల ఎకరాలకు నీరు తీసుకున్నారని అన్నారు. రంగనాయకసాగర్ దగ్గర హరీశ్‌రావుకు ఫాంహౌజ్ ఉన్నదా? లేదా? అని నిలదీశారు. ప్రాజెక్టులు కట్టిందే ఈ ఫాంహౌజ్‌ల కోసమని అన్నారు. దుర్మార్గపు ఆలోచన మీదని.. విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు. నిజనిర్ధారణ కమిటీ వేసి.. ప్రాజెక్టుల నుంచి మీవి, మీ బంధువుల భూములు ఎలా తొలగించారో తేల్చుదామన్నారు. భూ సేకరణ జరిగినప్పుడు వారికి బాధ ఉంటుందని.. వారికి మెరుగైన పరిహారం ఇవ్వాలనేదే తమ లక్ష్యమని అన్నారు. లగచర్ల భూములకు ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చామని.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. లగచర్ల బాధితులను రెచ్చగొట్టింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అని అన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ.36వేల కోట్ల విలువ ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరిట రూ.1.50లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు.

బీఆర్ఎస్ అధికారం దిగిపోయే నాటికి రూ.1.02 లక్షల కోట్ల బిల్లులు చెల్లించారని అన్నారు. దీనిపై వన్‌మెన్ కమిషన్ విచారణ జరుగుతున్నదని చెప్పారు. విద్యుత్ ముసుగులో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని.. దానిపై కమిషన్‌ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఫ్రాడ్ చేశారని.. వారిని శిక్షించాలని వన్‌మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికలో చెప్పిందన్నారు. కాళేశ్వరం మీద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ రోజు నివేదిక ఇచ్చిందని.. వచ్చే సభలో దానిపై చర్చ పెడుదామన్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను ప్రజలు ఓడగొట్టారంటే.. వారి ఆగ్రహం ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. మూసీ ప్రాజెక్టులు కట్టాలా వద్దా, మెట్రో రైలు నిర్మించాలా వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా.. అభివృద్ధి చేయాలా వద్దా చెప్పండి అని ప్రశ్నించారు. మాట్లాడితే ఇంగ్లిష్ గురించి మాట్లాడుతున్నారని.. చైనా, జపాన్, జర్మనీ వాళ్లకు ఇంగ్లిష్ రాదు.. కానీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయని అన్నారు. తాను గుంటూరులో చదువుకోలేదని, ఆ తరువాత పూనే వెళ్ళలేదని, అమెరికా వెళ్ళలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తాను ముఖ్యమంత్రిగా ఇక్కడకు వస్తే ఎందుకు అంత కడుపుమంట అని నిలదీశారు. వచ్చే ఐదేళ్లు తామే ఉంటామని, అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వాలని సూచించారు.

Tags:    

Similar News