పాత కలెక్టర్ అనుమతి పేరుతో అక్రమాలు..అడ్డగోలుగా ఇసుక రవాణా..?
అక్రమార్కులకు ఇసుక రవాణా కాసుల పంట పండిస్తోంది.

దిశ,ఎల్లారెడ్డిపేట : అక్రమార్కులకు ఇసుక రవాణా కాసుల పంట పండిస్తోంది. ట్రాక్టర్ యజమానులు ఇక్కడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. ఇసుక అక్రమ రవాణాకు అధికారులు సైతం వంత పాడుతున్నారనే అపవాదును అధికారులు మూటగట్టుకున్నారు. గత ఏడాది కాలం నుంచి బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అనుమతితో కొత్త కలెక్టర్ వచ్చినా పాత కలెక్టర్ అనుమతితో నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఇరిగేషన్ ఈ ఈ అమరేందర్ రెడ్డి ఆదేశాలతో మానేరు వాగును ఇరిగేషన్ డీఈ సత్యనారాయణ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి విచారణ చేశారు. దీంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల మధ్య మానేర్ వాగు ప్రవహిస్తోంది.
కాగా, ఎల్లారెడ్డిపేట మండలంలో గల పదిర మానేర్ వాగు నుంచి పక్క మండలంలోని ముస్తాబాద్‌లోగల అవునూర్, రామలక్ష్మణపల్లె గ్రామాల ట్రాక్టర్ యజమానులు ఆవునూరు ఇసుక రీచ్ నుంచి గత ప్రభుత్వంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. అదే ఇసుక రీచ్‌కు కొత్త కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదే ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాల విషయం పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇసుక రవాణా దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. ఇదంతా కూడా ట్రాక్టర్ యజమానులు ముస్తాబాద్ మండల రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో నడుస్తుందని బహిరంగంగా చర్చ జరుగుతోంది.
గత ఏడాది నుంచి వారానికి వందలాది ట్రిప్పుల ఇసుక ప్రైవేట్ పనులకు సరఫరా చేసే సహజ వనరులు కొల్లగొడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రామ లక్ష్మణ పల్లెకు చెందిన కొంతమంది ఇసుక వ్యాపారులు ఒక్కో ట్రాక్టర్‌లో ఆవునూర్ మానేర్ వాగు నుంచి ఇసుక ట్రాక్టర్ నింపుకోవడానికి రూ.150లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా వసూలు చేసిన ఇసుక ట్రాక్టర్ ట్రిప్ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయనేది ఇక్కడ అర్థం కాని విషయం. జిల్లా సరిహద్దులు దాటుతున్న ఇసుక? అవునూర్ మానేర్ వాగు నుంచి ఇసుకను రాత్రిపూట ఒక్కో ట్రాక్టర్‌ను సిద్దిపేటకు తరలించి రూ.6వేల నుంచి రూ.8 వేల వరకు అమ్ముకుంటూ అనుమతులు లేకుండా సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం.
అక్రమ తవ్వకాలు ఇలా వెలుగులోకి..
ముస్తాబాద్ మండలంలోని ఆవునూర్ గ్రామ రెవెన్యూ శివారులో గల మానేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న విషయాన్ని ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి తెలుసుకున్నారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మండలంలో ఎగువ మానేరు నీటి పారుదల తీరును పరిశీలించడానికి వచ్చిన ఇరిగేషన్ ఈ ఈ అమరేందర్ రెడ్డికి సమాచారం అందించగా డీఈ సత్యనారాయణ తో పాటు ముగ్గురు ఇరిగేషన్ సిబ్బంది వెళ్లి విచారణ జరిపారు. దీంతో చాలా రోజుల నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా వెలుగులోకి వచ్చింది. ఇది తీయడం తమకు కొత్త కాదని, చాలా రోజుల నుంచి ఇసుక రవాణా చేస్తున్నామని ట్రాక్టర్ డ్రైవర్లు చెప్పగా ఇరిగేషన్ అధికారులు అవాక్కయ్యారు. ఇసుక తీస్తున్నామని చెప్పగా పూర్తిస్థాయిలో విచారణ జరపగా చెక్ డ్యాంల కింద ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఫిర్యాదు చేయగా వెంటనే ఆవునూర్ మానేరు వాగు నుంచి ఇసుక తీయొద్దని ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి ముస్తాబాద్ మండల తహశీల్దార్ ఆర్.సురేష్‌ను ఆదేశించారు.
ఇసుక రవాణాకు అనుమతి లేదు : ఆర్.సురేష్, తహశీల్దార్, ముస్తాబాద్
ఆవునూరు గ్రామం నుంచి ఇసుక రవాణా నిలిపి వేస్తున్నాం. చెక్ డ్యాంల కింద ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులు సైతం అందాయి. అంతేకాకుండా జిల్లా ఇరిగేషన్ అధికారులు ఆవునూర్ మానేర్ వాగు నుంచి ఇసుక తీయడం నిలిపేయాలని ఆదేశించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇసుక రవాణా నిలిపేయడం జరుగుతుంది. కలెక్టర్ ఆదేశాలు అందిన తర్వాత ఇసుక రవాణాకు అనుమతులు మంజూరు చేస్తాం.