రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు
మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ ప్రశ్నపత్రాలు తరలింపులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరయ్యే విధంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలని కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జగిత్యాల జిల్లాలో 11,855 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నట్లు, అందుకుగాను జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శికి కలెక్టర్ వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని పరీక్షల విధుల్లో ఉండే సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చినట్టు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో డీఈఓ రాము, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.