డంపింగ్ యార్డ్ ను ఉపయోగించండి
డంపింగ్ యార్డ్ స్థలాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జె. అరుణ శ్రీ అధికారులను ఆదేశించారు.
దిశ, గోదావరిఖని : డంపింగ్ యార్డ్ స్థలాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జె. అరుణ శ్రీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ముందుగా రామగుండంలోని సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను సందర్శించి పూర్తి సామర్ధ్యంతో పని చేసేందుకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. నీటిని పూర్తిగా శుద్ది చేసిన తరువాతనే బయటకు వదలాలని అన్నారు.
అలాగే ప్లాంట్ లో పని చేసే సిబ్బందికి అవసరమైన మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. రామగుండంను చెత్తరహితంగా తీర్చిదిద్దాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ –4 సమీపంలో డంపింగ్ యార్డ్ కోసం సింగరేణి సంస్థ కేటాయించిన స్థలం ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం గోదావరి ఒడ్డున ఉన్న హిందూ శ్మశానవాటిక ను సందర్శించారు. శ్మశానవాటికలో అంత్యక్రియల కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. శ్మశానవాటికలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా రామగుండం నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, డీఈ శాంతి స్వరూప్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం, కుమార స్వామి తదితరులు ఉన్నారు.