రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : రామగుండం సీపీ

భద్రత మీ జీవితానికి సురక్ష, ప్రమాద రహిత కమిషనరేట్ గా

Update: 2025-01-05 06:20 GMT

 దిశ,గోదావరిఖని: భద్రత మీ జీవితానికి సురక్ష, ప్రమాద రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఆదివారం 5కే రన్ చేపట్టారు. శాంతి కపోతాలను ఎగరవేసిన, జెండా ఊపి ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు సిబ్బంది తో 5K రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటారని, వారి జీవితాలకు భరోసా ఉంటుందని తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. కార్లు నడిపే వారు విధిగా సీటు బెల్టు పెట్టుకోవాలని, వాహనాలు నడిపే సమయంలో వాహనాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలనీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని యువత తాత్కాలిక ఆనందం కోసం ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్, చేస్తూ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు మనో వేదనను మిగిలిస్తున్నారని ,తోటి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వివరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతి సంవత్సరం అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్పటికీ తగ్గడం లేదన్నారు. ప్రజలు చైతన్యవంతులై ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు సహకరించాలన్నారు. గత ఏడాది రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు 13 కోట్ల రూపాయల జరిమానాలు విధించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏ ఆర్ ఏసీపీ లు ప్రతాప్, సుందర్రావు , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, సత్యనారాయణ, లు కమిషనర్ పరిధిలోని సిఐలు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News