వినియోగదారులతో రద్దీగా మారుతున్న వేములవాడ రహదారి
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది వేములవాడ మున్సిపల్ అధికారుల తీరు.
దిశ, వేములవాడ: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది వేములవాడ మున్సిపల్ అధికారుల తీరు. రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో సరైన కూరగాయాల మార్కెట్లు లేక విక్రయదారుల తో పాటు కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వేములవాడలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మారుతున్న కాలం, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణ ప్రజలకు అందుబాటులో కూరగాయలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలు ఒకే దగ్గర సులువుగా అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మార్కెట్ భవనాన్ని నిర్మించింది. అందుకు పట్టణంలోని శామకుంటలో అత్యాధునిక హంగులతో రూ.3కోట్లతో కూరగాయల మార్కెట్‌తోపాటు రూ.7కోట్లతో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో శామకుంట మార్కెట్ నిర్మాణం పూర్తయి ప్రారంభమైంది. అయితే అక్కడ ఎలాంటి విక్రయాలు జరగడం లేదు. కాగా, మరో మార్కెట్ నిర్మాణ దశలో ఉంది.
రోడ్డు పక్కనే మార్కెట్ నిర్వహణ..
మార్కెట్ యార్డు లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ దశలో ఉండగా, శామకుంట మార్కెట్ నిర్మాణం పూర్తయినప్పటికీ అక్కడ ఇప్పటికీ ఎలాంటి విక్రయాలు జరగకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఉన్న పాత మార్కెట్ ఇరుకుగా మారిందని, శామకుంట వద్ద మార్కెట్ నిర్మాణం చేసి విక్రయదారులను అక్కడికి వెళ్లాలని అధికారులు సూచించారు. అయినా అధికారుల మాటలు పెడచెవిన పెట్టిన విక్రయదారులు 2వ బైపాస్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా కూరగాయలు, పండ్లు, మాంసాహారం వంటివి విక్రయిస్తున్నారు. దీంతో బైపాస్ రోడ్డు మొత్తం నిత్యం రద్దీగా మారుతుంది.
వాహనదారుల బెంబేలు..
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు విక్రయదారుల తీరుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బైపాస్ రోడ్డును అనుకుని వందలాది సంఖ్యలో విక్రయదారులు కూరగాయలు విక్రయించడం, అవి కొనుగోలు చేసేందుకు వేలాదిమంది కొనుగోలుదారులు అక్కడికి వెళ్లడం తో రహదారి నిత్యం రద్దీగా మారుతోంది. ఈ క్రమంలో అటుగా వెళ్ళే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. బైపాస్ రోడ్డు అంటేనే ట్రాఫిక్ తక్కువ ఉండి అత్యవసర పరిస్థితులతోపాటు ఇతర సమయాల్లో స్పీడ్‌గా వెళ్లే అవకాశం ఉన్న రోడ్డు. అలాంటి రోడ్డులో జనసంచారం ఎక్కువగా ఉండడంతో వాహనదారులు ఎలా వెళ్లాలో తెలియక, ఎప్పుడూ ఏమీ జరుగుతుందోననే ఆందోళనతో భయంభయంగా అటువైపు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
నిత్యం ఎన్నో ప్రమాదాలు..
పట్టణ ప్రజలతోపాటు రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు, వీఐపీ వాహనాలు రాజన్న ఆలయం వైపు నేరుగా వెళ్తున్నాయి. ఆ వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించేందుకు పట్టణంలోని తిప్పాపూర్ మూలవాగు వంతెన నుంచి కోరుట్ల బస్టాండ్‌లోని నంది చౌరస్తా వరకు సుమారు 2కిలోమీటర్ల మేర 100ఫీట్ల వెడల్పు తో బైపాస్ రహదారిని నిర్మించారు. దీంతో ఆలయం ముందు వాహనాల రద్దీని నియంత్రించడం తో పాటు కోరుట్ల, సిరికొండ వైపు వెళ్లే వాహనాలు పట్టణంలోకి రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వ ఆశయానికి గండి కొట్టే విధంగా విక్రయదారులు కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసాహారం వంటివి విక్రయిస్తుండడంతో రహదారి మొత్తం ఇరుకుగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు, పలువురు వాహనదారులు వాపోతున్నారు.
వ్యాపారులకు అవగాహన కల్పించడంలో విఫలం
అత్యంత ప్రమాదకర స్థితిలో బైపాస్ రోడ్డులో కూరగాయల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు రూ.3 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకుని నిరుపయోగంగా మారిన మార్కెట్, మరోవైపు ఇంకొన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి కాబోతున్న మార్కెట్ ఇలా రెండు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా విక్రయదారులు మాత్రం రోడ్డు పక్కనే కూరగాయలు విక్రయిస్తూ ప్రత్యక్షంగా ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ సంబంధిత అధికారుల దృష్టి మాత్రం అటువైపు మళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తలచుకుంటే విక్రయదారులను అక్కడి నుంచి తరలించడం పెద్ద విషయమేమీ కాదని, కానీ వారికి అవగాహన కల్పించడంలో వారిని ఒప్పించి, మెప్పించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులు మాకెందుకులే అనుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిజానికి అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ విక్రయదారులతో నేరుగా మాట్లాడి వారిని బుజ్జగిస్తే నిర్మాణం పూర్తయిన భవనాల్లోకి విక్రయదారులు వెళ్లడం పెద్ద పనేమీ కాదనే చర్చ జరుగుతోంది.
ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి..?
ఇక ఇవన్నీ ఇలా ఉంటే వాస్తవానికి పట్టణ ప్రజలు, వ్యాపారుల కష్టాలు తీర్చాలనే ప్రధాన లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో భద్రతా చర్యలను సైతం పరిగణనలోకి తీసుకుని అసలు ఎలాంటి వాహనాలు రాని, రద్దీ లేని ప్రదేశాల్లో మార్కెట్లు నిర్మించింది. అయినప్పటికీ విక్రయదారులు మాత్రం అవేవీ తమకు పట్టనట్లు, ఎవరి భద్రత తమ బాధ్యత కాదు అన్నట్లు, కేవలం జేబులు నింపుకోవడమే తమ లక్ష్యం అన్నట్లు వ్యవహరిస్తూ రహదారి పక్కనే విక్రయాలు జరపడం పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని..?, ప్రజల ప్రాణాలకు బాద్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల కింద రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఆలూరు స్టేజీ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న రైతులపైకి లారీ దూసుకెళ్లి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందడంతోపాటు మరికొంత మంది రైతులు గాయపడిన సంఘటనను గుర్తు చేస్తున్నాయి.
వ్యాపారులు ముందుకు రావడం లేదు
నిర్మాణం పూర్తయిన శామకుంట మార్కెట్‌లో కూరగాయల విక్రయాలకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు బహిరంగ ప్రకటన వేశాం. ఇప్పుడున్న చోటు నుంచి మార్కెట్‌ను ఇక్కడికి తరలిస్తే వ్యాపారాలు సాఫీగా సాగవనే కారణంతో విక్రయదారులు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యేతోపాటు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టికి సైతం తీసుకెళ్లాం. కౌన్సిల్‌లో చర్చించాం. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్పితే ఈ విషయం కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.:- అన్వేష్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ.