purchase centers : ధాన్యమంతా దళారుల పాలు.. కొనుగోలు కేంద్రాల్లో అన్న దాత గోస..
ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులకు గోస తప్పడం లేదు.
దిశ, గంభీరావుపేట : ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులకు గోస తప్పడం లేదు. రోజుల తరబడి రైతులు ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు వరద నీటితో ధాన్యం తడవడం, అరబెట్టుకుంటూ అనేక వ్యయ ప్రయాసలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ కొనుడు మాత్రం మరిచారు.. గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేస్తాం’ అని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది.
గంభీరావుపేట మండలంలో మొత్తం గంభీరావుపేట సొసైటీ ఆధ్వర్యంలో 13, కొత్త పెళ్లి ప్యాక్స్ ఆధ్వర్యంలో 37 ఐకేపీ కేంద్రాలకు 2 కేంద్రాలను ప్రారంభించారు. లక్ష్యంగా పెట్టుకొని, జిల్లా అదనపు కలక్టర్, మండల స్థాయి ప్రజాప్రతినిధులు ఈ కేంద్రాలను ప్రారంభించినా.. ఇంకా ఎక్కడా కొనుగోళ్లు మొదలు కానేలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు దళారులు, వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఓ వైపు వర్షం పడుతుండడం, మరోవైపు కేంద్రాల్లో కొనకపోవడంతో అగ్గువసగ్గువకే అమ్ముకుంటున్నారు.
అయితే అకాల వర్షాల కారణంగా తేమ శాతం అధికంగా ఉందని, కేంద్రాల్లో కొనుగోళ్లు జరపాలంటే మరో వారమైనా పడుతుందని, రైస్ మిల్లులకు ధాన్యం కొనుగోలు అలర్ట్ మెంట్ ఇవ్వలేదని, గన్ని సంచుల కొరత ఉందని అధికారులు చెబుతుండగా, ఆ మాత్రం దానికి ఇప్పుడే కొన్నట్టు కేంద్రాలను ప్రారంభించుడెందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. తక్కువ ధరకు దళారులకు దాదాపు ఇలాంటే పరిస్థితి ఉండగా, కల్లాల వద్దనే దళారులు, వ్యాపారులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాదికి కనీస మద్దతు ధర ఏ గ్రేడ్‌కు 2,320, సాధారణ రకానికి 2,300 నిర్ణయించింది కానీ, దళారులు మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. క్వింటాల్‌కు 1,800 నుంచి 1900 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది. నిర్ణీత ధాన్యం పరిమాణానికి అనుగుణంగా బ్యాంకుల్లో ఆస్తులు తాకట్టుపెట్టి.. బ్యాంకు గ్యారెంటీ పత్రాలు తీసుకొని, పౌరసరఫరాల సంస్థకు అప్పగించిన రైస్ మిల్లర్లకే ఇక పై ధాన్యం కేటాయించాలని నిర్ణయించింది.
దీనితో పాటు కొనుగోలుకు అనుగుణంగా కొనుగోలు రేటు పై 10 శాతం డిపాజిట్ ను రైస్ మిల్లర్లు పెట్టాలని నిబంధన కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన ఉండడం, మరో వైపు కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచుల కొరత, నిర్ణత గడువులో పూర్తి చేయక పోవడం తదితర అంశాల వల్లక కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదని అంటున్నారు. మిల్లర్లతో ఒప్పందం లేదు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండడం లేదు. ఓ వైపు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు, మంత్రులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.
ఇప్పటివరకు ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో పాలసీనే విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదంటున్నారు రైతులు. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లతో సివిల్ సైప్లె ఒప్పందం చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు ఒప్పందం జరగలేదు. యంత్ర పరికరాలు, సంచులు, టార్పాలిన్ల పరిస్థితి తెలిసిందే. ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే ప్రభుత్వం కొనుగోళ్ల పై హడావిడి ప్రకటనలు చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పలు రైతుల ఆవేదన..
నాకు మూడెకరాల పొలం ఉన్నది. సెంటర్‌కు వడ్లు తెచ్చి పన్నెండు రోజలైతాంది. వానకు నానుతున్నవి. ఎండకు ఎండుతున్నయి. తడిసినప్పుడల్లా తిర్లమర్ల పోత్తున్నం. మాకు ఇంకో పనేలేదు. మబ్బుల పడుతున్నప్పుడల్లా జల్లుమంటంది. అక్కడక్కడ సెంటర్లు స్టార్ట్ చేసిన్రు. గింజలైతే కొంటలేరు. గీసర్కారొచ్చినంక పెట్టుబడికి పైసలే ఇయ్యలే. అక్కడక్కడ బాకీలు తెచ్చి లాగోడిపెట్టుకున్నం. ఇగ గింజలేమి కొంటుందో లేదో అర్థమయితలేదు. చాలా మంది రైతులు తుట్టికే దళారీలకు అమ్ముకుంటున్రు. మా పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.