ఈడీ కదలికలపై రాష్ట్రం అంచనాలు తలకిందులు

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖుల..

Update: 2022-09-21 02:59 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు వారితో సాన్నిహిత్యంగా ఉన్న వారి ఇళ్లపై ఈడీ దాడులకు పాల్పడుతుందని.. అను క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలోని కీలక వ్యక్తులు అంచనా వేశారు. కావాలనే ఈడీ ఎంట్రీ ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తుందని, అబాసు పాలు చేసేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని భావించి పకడ్భందీగా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఉన్నతాధికారులతో పాటు ముఖ్య భూమిక పోషించే నేతలు సమాలోచనలు జరిపి ఈడీ ఎత్తులకు పైఎత్తులు వేయాలని భావించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన ఇళ్ల వద్ద బందోబస్తును రెట్టింపు చేశారు. తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్ వద్ద కూడా నిఘా వర్గాలను, భద్రతా సిబ్బందిని పెంచారు. 24 గంటల పాటు కంటి మీద కునుకు లేకుండా ముఖ్యమంత్రి ఇంటి వద్ద కాపలా కాయాల్సిందేనన్న ఆదేశాలు రావడంతో పోలీసు బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాయి.

ఉత్తర తెలంగాణ భవన్ రహదారికి రోడ్ స్టాపర్‌లను ఏర్పాటు చేసిన అధికారులు ప్రత్యేకంగా ఓ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడకు ఎవరు వచ్చినా వారిని క్షుణ్ణంగా పరిశీలించి, వాహనాల్లో కూడా అన్నింటిని గమనించి మొత్తం వీడియో రికార్డు చేయాలన్న ఆదేశాలు కూడా వచ్చాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఈ ఆర్డర్స్‌తో జిల్లాలోని పోలీసు బృందాలు, నిఘా వర్గాలు హై అలెర్ట్ అయ్యాయి.

ఆగస్టు రెండో వారంలోనే ఈడీ రంగంలోకి దిగుతుందని అప్రమత్తం అయినప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో నెమ్మదిగా అంతా సద్దుమణిగిపోయిందని భావించారు. దీంతో క్రమక్రమంగా ఈడీ సోదాలు నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రాంతాల్లో నిఘాను తగ్గించుకుంటూ వచ్చారు అధికారులు.

ట్విస్ట్ ఇచ్చిన వైనం..

ఆగస్టులో కాకుండా సెప్టెంబర్ మొదటి వారంలో ఈడీ హైదరాబాద్‌లోనే పలుచోట్ల సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన గండ్ర ప్రేమ్ సాగర్ రావుకు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఆయనకు సంబంధించిన ఆఫీసులతో పాటు మరిన్ని చోట్ల కూడా రైడ్స్ చేశారు.

తిరిగి సోమవారం రామంతాపూర్, బంజారాహిల్స్, మాదాపూర్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇందులో పోతుగల్‌కు చెందిన 888 శ్రీనివాస్ రావు ఆఫీసుల్లో సోదాలు చేపట్టి అతన్ని దాదాపు ఏడు గంటల పాటు విచారణ చేసింది. దీంతో అందరి దృష్టి మరోసారి కరీంనగర్‌పై పడింది.

అంచనాలు తలకిందులు..

ఈడీ కదలికలపై ఇక్కడి ఉన్నతాధికారులు, ముఖ్య నాయకుల అంచనాలు తలకిందులు అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశాలు ఉంటాయని భావించినప్పటికీ ఈడీ అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా డిజిటల్ డివైజెస్‌లు, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒక్కొక్కరి ప్రమేయాన్ని బయటకు తీసే పనిలో నిమగ్నం కావడం గమనార్హం.

Also Read : లిక్కర్ స్కాంలో రోజుకో ట్విస్ట్.. వెలుగులోకి ఎంపీ సంతోష్ రావు లింకులు?



Similar News