పేరుకు వార్డు కౌన్సిలర్.. చేసేది పాడు పనులు..!
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి...
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రతినెల పంపకానికి రేషన్ డీలర్ల దగ్గరికి చేరిన బియ్యం రోజుల వ్యవధిలోనే మాఫియా చెంతకు చేరుతున్నాయి. ఊరూరా తిరిగి వినియోగదారుల నుంచి తక్కువ ధరకు సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో పేదల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న పథకం నీరుగారిపోతోంది. పీడీఎస్ అక్రమ దందాను అరికట్టేందుకు అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంగా సాగిస్తున్న పీడీఎస్ రైస్ మాఫియాలో ఓ కౌన్సిలర్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్రమంగా పీడీఎస్ రైస్ దందా చేస్తున్న వారిపై నిఘా కఠిన తరం చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
దందాలో కింగ్ పిన్‌గా ఓ కౌన్సిలర్..
జగిత్యాల బల్దియాలో కౌన్సిలర్‌గా ఉన్న ఓ లీడర్ కనుసన్నల్లో అక్రమ పీడీఎస్ రైస్ దందా జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. ఈ దందాలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న సదరు కౌన్సిలర్ ప్రతి నెలా అధికారుల కళ్లు గప్పి టన్నుల కొద్ది బియ్యాన్ని రాష్ట్రాలు దాటిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం సేకరించేందుకు కొంతమందిని ఏర్పాటు చేసుకొని నిత్యం చుట్టుపక్కల గ్రామాల్లోని వినియోగదారుల నుంచి బియ్యం సేకరిస్తుంటారు. మరోవైపు కొద్దిమంది రేషన్ డీలర్లతో ముందుగానే ఒప్పందం చేసుకొని రేషన్ ఇచ్చే టైంలో రైసుకు బదులు వినియోగదారులకు డబ్బులు ఇస్తూ అవే బియ్యాన్ని అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఇలా సేకరించిన రైస్ మొత్తాన్ని జగిత్యాలలో ఓ చోట డంపు చేసి రాత్రిళ్లు అక్రమంగా ట్రాన్స్ పోర్ట్ చేస్తుంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సదరు కౌన్సిలర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీలో ఉంటేనే అక్రమ దందా మార్గం సుగమం అవుతుందనే పార్టీ మారినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రూ.కోట్లలో బియ్యం దందా..
వినియోగదారుల నుంచి కిలో బియ్యం రూ.10నుంచి రూ.12రూపాయలకు ఈ ముఠా కొనుగోలు చేస్తుంది. ఊరూరా తిరిగి బియ్యం సేకరించే వారికి కిలోకు ఇంత అని ముందుగా మాట్లాడుకున్న ప్రకారం కమీషన్లు ముట్ట చెబుతారు. ఇలా సేకరించిన బియ్యం టన్నుల కొద్ది లారీల్లో పక్క రాష్ట్రాలకు తరలించి కిలో రూ.35నుంచి రూ.40కు అమ్మి సొమ్ము చేసుకుంటారు. మహారాష్ట్రలో పీడీఎస్ రైస్ వినియోగం, ట్రాన్స్‌పోర్ట్‌పై ఎలాంటి నిబంధనలు లేకపోవడం, పొరుగునే ఉన్న రాష్ట్రం కావడంతో బియ్యం తరలింపు అక్రమార్కులకు సులభతరంగా మారింది. టన్నుల కొద్ది బియ్యాన్ని అక్రమంగా ఎక్స్ పోర్ట్ చేస్తున్న ఈ దందాలో ప్రతి నెలా రూ.కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మైనర్లతో బియ్యం సేకరణ...
పీడీఎస్ దందా నడుపుతున్న సదరు కౌన్సిలర్ ఉండే వార్డులోని కొందరు మైనర్లను బియ్యం సేకరణకు వినియోగిస్తున్నట్లుగా సమాచారం. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి అక్రమ దందా చేస్తూ చదువుకోవాల్సిన పిల్లలను ఇలాంటి పనులకు వినియోగిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలు చేపట్టి బాల కార్మికులకు విముక్తి కల్పిస్తుంటే పట్టణం నడి ఒడ్డున పిల్లలను ఇలా ఇల్లీగల్ పనులకు వినియోగించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విచారణ చేపడితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తనిఖీలు నామమాత్రమే..!
ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద మొత్తంలో అక్రమ రవాణా చేసే బియ్యాన్ని వదిలేసి అరకొరా చిన్న మొత్తంలో రవాణా చేసే బియ్యాన్ని పట్టుకొని అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేసే వారితోపాటుగా ఆ బియ్యాన్ని సన్న బియ్యంగా రీసైక్లింగ్ చేసే కొన్ని మిల్లులపై కొరడా ఝలిపించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని పెద్దఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి.