బెల్ట్ షాపుల్లో ముందుకి.. అభివృద్ధిలో వెనక్కి..
ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా తెలంగాణా ప్రజలను సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి : ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా తెలంగాణా ప్రజలను సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పీసీసీ కమిటీ పిలుపు మేరకు జిల్లాలో దశాబ్ది ఉత్సవాల దగా పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఇందిరా భవన్ నుండి తహసీల్దార్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్ళింది అని బెల్ట్ షాప్ ల ఏర్పాటులో మాత్రం ముందుకు వెళ్లిందని ఇదేనా అభివృద్ధి అని చురకలంటించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు వివరించేందుకే దశాబ్ది దగా పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, సర్పంచులు తాటిపర్తి శోభరాణి, కొమ్ముల లక్ష్మి, నాయకులు చాంద్ పాషా, రవీందర్ రావు, గుండా మధు తదితరులు పాల్గొన్నారు.