రాష్ట్రంలో ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రామగుండం బీ పవర్ హౌస్ ను విస్తరించాలని విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉందన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

Update: 2023-04-17 09:05 GMT

దిశ, గోదావరి ఖని: రామగుండం బీ పవర్ హౌస్ ను విస్తరించాలని విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉందన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం రామగుండం నియోజకవర్గంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర బ్రాహ్మణపల్లి గ్రామానికి చేరుకుంది. అనంతరం గ్రామంలో మహిళలు, యువకులు, రైతులు పాదయాత్రకు ఎదురొచ్చి ఘన స్వాగతం పలికారు. రచ్చబండ దగ్గర సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వారు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి వివరించారు.

రామగుండం ఎరువుల కర్మాగారంలో కొలువులు ఇప్పిస్తామని అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. కొలువులు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వడం లేదని ఏకరువు పెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి దాహానికి మోసపోయిన హరీష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై నిప్పులు చెరిగారు.

మంచిర్యాల జిల్లా ముగించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గానికి చేరుకున్న తన పాదయాత్రకు ఎల్లంపల్లి బ్రిడ్జి వద్ద ఘనంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం నియమాకాలపైనే కొనసాగిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. యువతకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. నిజాం కాలం నాటి జెన్కో పవర్ ప్రాజెక్టును ఆధునీకరణ చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమని అన్నారు.

తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా .. రామగుండం జెన్కో పవర్ ప్రాజెక్టును అప్ గ్రేడ్ చేయకుండా ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేశారు. సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కానీ అక్కడున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆ ప్రాంత అభివృద్ధి కావాలన్న చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తున్నదని ఆరోపించారు. ఓట్ల కోసం హైదరాబాదులో గోదావరి నీళ్లను ఇంటింటికీ ఉచితంగా అందించే సీఎం కేసీఆర్ రామగుండానికి ఎందుకు ఇవ్వలేదంటూ అని ప్రశ్నించారు.

రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో యువకుల దగ్గర డబ్బు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసిన ఎమ్మెల్యే తీరు అంతకంటే మరో దుర్మార్గం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి, పాలకుర్తి అంతర్గామ్ మండలాలకు సాగునీరు అందిస్తామన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి సింగరేణి కాలరీస్ సంస్థ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రామగుండంలో గెలిపిస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News