ఆధిపత్యం కోసం పోరాటం.. మంత్రి పొన్నం వర్సెస్ కౌశిక్

జిల్లాలో మంత్రి పొన్నం ను హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నేరుగా

Update: 2024-06-14 12:50 GMT

దిశ,హుజురాబాద్ : జిల్లాలో మంత్రి పొన్నం ను హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నేరుగా ఢీ.. కొంటున్నాడు. జిల్లాలో బీఅర్ఎస్ ప్రాబల్యం పూర్తిగా తగ్గుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ ను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నీ నేరుగా ఢీ కొనడం తప్ప మరే మార్గం లేదన్న కేసీఆర్ సూచనల మేరకు కౌశిక్ రంగంలోకి దిగినట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక వెలుగు వెలిగిన నాయకులు కాంగ్రెస్ పార్టీ పై నేరుగా యుద్ధం చేయలేక ముఖం చాటేస్తున్న తరుణం లో కౌశిక్ యుద్దానికి సై అంటూ నేరుగా పొన్నం పై మాటల యుద్ధం ప్రకటించడం జిల్లాలో చర్చనీయాంశం అయింది. హుజురాబాద్ లో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు పుంజుకోగా ఎమ్మెల్యే కౌశిక్ ఓటు బ్యాంకు తగ్గడంతో దీనికంతటికీ మంత్రి పొన్నం రచించిన వ్యూహం కారణమని భావించడం తో పాటుగా అధికారులను తనకు ప్రోటోకాల్ ఇవ్వకుండా పొన్నం అడ్డుకుంటున్నాడని భావించిన కౌశిక్  ఇక పొన్నం తోనే యుద్ధం చేయాలని,బూడిద వ్యవహారం బయటకు తీసినట్లు భావిస్తున్నారు.

బూడిద పై రచ్చ రచ్చ చేసిన కౌశిక్ కు పొన్నం సమాధానం ఇవ్వకుండా తన అనుచరులను రంగంలోకి దించి ఎదురు దాడి చేయిస్తున్నా నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.గత నాలుగు రోజులుగా ఈ వ్యవహారం నియోజక వర్గం తో పాటుగా రాజధానిలో వేడి పుట్టించింది.కౌశిక్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ కు అత్యంత ఆత్మీయుడు గా పేరు తెచ్చుకున్నాడు. బీఆర్ఎస్ తరపున ఏ విధమైన ఉద్యమం చేయాలన్నా కౌశిక్ తో చర్చలు జరిపే స్థాయికి చేరుకున్నాడు.హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో కౌశిక్ పార్టీ మారుతాదనే అనుమానం మొదట్లో కలిగింది. కానీ తాను పార్టీ నీ వీడిది లేదని,కేసీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ లోనే ఉంటానని తెలిపి బీఆర్ ఎస్ లో ఆత్మ విశ్వాసం నింపాడు. హుజురాబాద్ తో పాటుగా జిల్లాలో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడానికి కౌశిక్ ప్రత్యేక వ్యూహ రచనతో ముందుకు వెళుతున్నట్లు సమాచారం. దీంతో పొన్నం తో ఢీ కొంటేనే తనకు,పార్టీ కి మైలేజ్ వస్తుందని భావించి ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కాగా గతం లో ఈటల ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో అధికారులు ఈటల కు ప్రోటోకాల్ ఇవ్వకుండా చేసిన కౌశిక్ కు అదే విధంగా చేయాలని భావించిన పొన్నం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.దీంతో అధికారిక కార్యక్రమాలకు కౌశిక్ ను అధికారులు పిలవడం లేదని,అయినా కౌశిక్ సమాచారం తెలుకుని వస్తున్నట్లు తెలిసింది.దీంతో అధికారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ఏది ఏమైనా ప్రస్తుతం కౌశిక్,పొన్నం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పొన్నం మాత్రం చాప కింద నీరులా కౌశిక్ అనుచరులను ఒక్కొక్కరిని బీఆర్ఎస్ నుంచి బయటకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతుందని,గతంలో వీరు పొన్నం అనుచరులుగా ఉండటం తో వీరికి చెప్పి ప్రణవ్ బాబు దరి చేరుస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ వైరం ఇంకాస్త పెరిగి దుమారం రేపే అవకాశం ఉందని,పొన్నం పథకం ప్రకారం బీఆర్ఎస్ ను బలహీన పరుస్తున్నట్లుగా సమాచారం.

Tags:    

Similar News