అమ్మే భారమైంది..!
9 నెలలు మోసి, కని, కంటికి రెప్పలా పెంచిన కన్నతల్లే ఆ బిడ్డలకు భారమైంది. మొదట్లో కొడుకులందరూ వంతుల వారిగా పోషించాలని అనుకున్నారు.
దిశ, హుజురాబాద్ రూరల్: తొమ్మిది నెలలు మోసి, కని, కంటికి రెప్పలా పెంచిన కన్నతల్లే ఆ బిడ్డలకు భారమైంది. మొదట్లో కొడుకులందరూ వంతుల వారిగా పోషించాలని అనుకున్నారు. పెద్ద కుమారుడు 4 నెలలుగా పోషిస్తున్నా రెండో కుమారుడు తీసుకెళ్లడం లేదని, పెద్ద కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో చేసేదేం లేక చిన్న నాటి నుంచి పోలియోతో బాధపడుతున్న ఆ తల్లి స్టాండ్ సహాయంతో ఠాణా మెట్లు ఎక్కింది. న్యాయం చేయండంటూ పోలీసులను వేడుకుంది.
హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన నగునూరు సరోజన(70)కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. నలుగురిని పెంచి పెద్ద చేసి, పెళ్లిళ్లు చేసింది. ఉన్న రెండెకరాల 12 గంటల భూమిని, ఉన్న కొద్దిపాటి ఆస్తిని కొడుకులకు పంచి తన బాధ్యతను నెరవేర్చుకుంది. భర్త కొమురయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. చిన్న కుమారుడు లింగయ్య కూడా అనారోగ్యంతో మరణించాడు. ఇలాంటి టైంలో వయోభారంతో ఉన్న వికలాంగురాలైన ఆ తల్లిని కంటికి రెప్పల చూసుకోవలసిన కొడుకులు పేగుబంధం భారంగా భావించారు.
అమ్మకు ఏ లోటు రాకుండా చూసుకోవాల్సింది పోయి భూమి తగాదాతో రెండో కుమారుడు ఆమెని పోషించడానికి నిరాకరించాడు. ఒక కుమారుడు మరణిస్తే పెద్ద కుమారుడు కొన్ని రోజులు పోషించి వెల్లగొడితే, రెండవ కుమారుడు పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఇద్దరు అమ్మను దూరం పెట్టారు. కొడుకులతో విసిగిపోయిన ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. సీఐ తిరుమల గౌడ్ కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే 4 నెలలుగా తానే తల్లిని పోషిస్తున్నానని, వంతుల ప్రకారం 2 నెలలు దాటిన తరువాత రెండో కుమారుడు సంపత్ తల్లిని తీసుకెల్లాలని పెద్ద కుమారుడు రాజేందర్ తెలిపాడు. దీంతో సంపత్‌ను తల్లిని తీసుకెళ్లి పోషించాలని, ఇద్దరూ తల్లిని సక్రమంగా చూసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కౌన్సిలింగ్ నిర్వహించడంతో ఒప్పుకున్నాడు. అయినప్పటికీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్లీ తల్లిని రెండో కుమారుడు తీసుకెళ్లలేదని పెద్ద కుమారుడు రాజేందర్ వాపోయాడు.
‘సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేయాలి’
కన్నవారి పట్ల కనికరం లేకుండా ప్రవర్తించే కొడుకులపై సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ కోరుతున్నారు. కన్నవారిని ఆదరించకుంటే సీనియర్ సిటిజన్ ఆక్ట్ అమలు చేసేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను రిజిస్టర్ చేసుకున్న కొడుకులపై రద్దుచేసి తల్లిదండ్రులకే బదిలాయించాలని వారు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల పోషణ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.