భద్రాది సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల పట్టు పీతాంబరం
భద్రాది సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల పట్టు పీతాంబరాన్ని సిరిసిల్ల పట్టణానికి చెందిన నేతన్న వెల్ది హరిప్రసాద్ సిద్ధం చేయనున్నారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: భద్రాది సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల పట్టు పీతాంబరాన్ని సిరిసిల్ల పట్టణానికి చెందిన నేతన్న వెల్ది హరిప్రసాద్ సిద్ధం చేయనున్నారు. భద్రాద్రి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 20 రోజుల పాటు శ్రమించి సాక్షాత్తూ సీతారాములకు పట్టు పీతాంబరాన్ని సిద్ధం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు హరిప్రసాద్ తెలిపాడు. అద్భుతమైన కళ నైపుణ్యానికి కేరాఫ్ సిరిశాల సిరిసిల్ల.
అగ్గిపెట్టె, దబ్బనం వంటి వాటిలో ఇమిడే చీరలు నేసిన ఘనత కేవలం సిరిసిల్ల నేతన్నల సొంతం. తాజాగా భద్రాద్రి లో జరగనున్న కళ్యాణ మహోత్సవానికి సీతమ్మకు పట్టు పీతాంబరం నేసి పంపించాడు ఇక్కడి నేతన్న. 750 గ్రాముల బరువున్న పట్టు పీతాంబరంలో 150 గ్రాముల వెండి, పట్టు దారంతో నేసినట్టు నేతన్న హరిప్రసాద్ వివరించారు. చేనేత మగ్గంపై ఎంతో శ్రమించి నేసిన చీరను భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవంలో సీతమ్మకు అలంకరించాలని తయారు చేసినట్లు హరిప్రసాద్ తెలిపారు.
తాను స్వయంగా నేసిన పట్టు పీతాంబరాన్ని భద్రాద్రి చేరవేయాలని మంత్రి కేటీఆర్ ను హరిప్రసాద్ అభ్యర్థించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలంటూ అధికారులను సైతం ఆదేశించారు. ఈ మేరకు పట్టు పీతాంబరాన్ని అధికారులు భద్రాద్రి ఆలయానికి తరలించారు.