మద్యం సేవించావంటూ చిరు వ్యాపారిని చితకబాదిన ఎస్సై..
అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ అధికారికి చిరు వ్యాపారి కంటపడడంతో మద్యం సేవించామంటూ చితకబాదాడు.
దిశ, గోదావరిఖని : అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ అధికారికి చిరు వ్యాపారి కంటపడడంతో మద్యం సేవించామంటూ చితకబాదాడు. ఈ సంఘటనలో సదరు వ్యాపారి చేయి విరిగింది. దీంతో వ్యాపారి కుటుంబ సభ్యులు ఎస్సై చర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న యువకులు వీరంగం సృష్టించారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో నిన్న రాత్రి జరిగింది. స్థానిక సీతానగర్ లో పోరండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి పాన్ షాపు నిర్వహిస్తాడు.
సదరు వ్యాపారి మద్యం సేవించాడనే నెపంతో షాపుకు వచ్చి చితకబాదాడు. దీంతో తన భర్తకు మద్యం సేవించే అలవాటు లేదని చెప్పినప్పటికీ వినకుండా లాఠీతో ఇష్టం వచ్చిన్నట్లు కొట్టాడని ఆరోపించారు. ఈ సంఘటనలో అతని చెయ్యి విరిగింది. దీంతో శ్రీనివాస్ అతని కుటుంబ సభ్యులు, స్థానికులు ఎస్సై చర్యను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసుల ఓవర్ యాక్షన్ పై తిరుగుబాటు చేశారు. స్థానికులు ఆందోళనకు దిగటంతో ఉద్రిక్తత నెలకుంది.