శివాజీ పాలన నేటి పాలకులకు ఆదర్శం : ఎమ్మెల్యే చందర్

ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలన, కార్యాచరణ తనకు ఆదర్శమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

Update: 2023-02-19 14:29 GMT

దిశ, గోదావరి ఖని : ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలన, కార్యాచరణ తనకు ఆదర్శమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆరె కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, కుల పెద్దలతో కలిసి శివాజీ విగ్రహానికి పూలమాలవేశారు. జయంతి కేకును కట్ చేశారు. మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శివాజీ పరిపాలన నేటి పాలకులందరికీ ఆదర్శప్రాయమన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించడం కోసం యుద్ధం చేసినప్పటికీ, వారి మహిళల పట్ల ఆయన ఎంతో మర్యాదగా వ్యవహరించారన్నారు. శివాజీ, నిరంకుశ పాలకులైన మొఘలులకు వ్యతిరేకమే కానీ ముస్లింలకు కాదన్నారు.

    ఆయన సైన్యంలో మూడో వంతు ముస్లిం సైనికులే ఉండేవారని తెలిపారు. తన పాలనలో కులమతాలను సమదృష్టితో చూశారని, హిందూ ముస్లిం అనే విభేదాలు ఎన్నడూ చూపలేదన్నారు. హిందూ దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ముస్లింల మసీదులను కూడా పునరుద్ధరించారని పేర్కొన్నారు. కానీ నేడు మత చాందసవాదులు కొందరు శివాజీని హిందూ రాజుగా మాత్రమే ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. భారతీయులంతా సోదర భావంతో కలిసి మెలిసి జీవించాలన్నారు. సంఘ నాయకుల కోరిక మేరకు ముందుకొచ్చిన ఆరె కుల బాంధవులందరినీ శివాజీ జన్మించిన స్వగ్రామానికి తీసుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, ఆరెకుల సంక్షేమ సంఘం నాయకులు అధర్సండే సమ్మారావు, మోహన్ రావు, డ్యాగం చంద్రమోహన్, వీరన్న, తిప్పారపు రాజేశ్వరరావు, మోరె మోహన్ రావు తోపాటు సంక్షేమ సంఘ సభ్యులు, ఆరె కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News