దళిత బంధు పంపిణీపై శ్వేత పత్రం విడుదల చేయండి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
2022-23 బడ్జెట్ లో దళిత బంధుకి కేటాయించిన 17,700 కోట్లలో ఎంత మందికి దళిత బంధు పంపిణీ చేశారో మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి: 2022-23 బడ్జెట్ లో దళిత బంధుకి కేటాయించిన 17,700 కోట్లలో ఎంత మందికి దళిత బంధు పంపిణీ చేశారో మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మీడియాతో ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజక వర్గానికి 1500 మంది చొప్పున 119 నియోజక వర్గాల్లో నిరుపేద దళితులకు ఉపాధి కల్పించేందుకు నిధులు వాటిలో ఒక్క యూనిట్ కూడా మంజూరు చేయకుండా అవే నిధులను ప్రస్తుత బడ్జెట్ లో కేటాయించారని, రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న గతేడాది లబ్ధి దారులను కలుపుకుని నియోజక వర్గానికి 3000 మందికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2022-23 లో నియోజక వర్గానికి 3000 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని ఒక్క లబ్ధి దారుడిని గుర్తించలేదని, ఇప్పుడేమో జాగ ఉన్నవారికి నిర్మాణ వ్యయం కింద మూడు లక్షలు ఇస్తామని మరోసారి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అని ధ్వజమెత్తారు. పేదలకు బతుకుదెరువు చూపమంటే ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నామని అంటున్నారని ఇందుకేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదని నిలదీశారు. రిజర్వేషన్లు అనేవి జనాభా ప్రాతిపదికన కల్పించేవి అని రాజ్యాంగంలో ఉందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఆంశమని నాలుగేళ్లుగా మొత్తుకున్నా వినలేదన్నారు.
నాలుగేళ్లుగా గిరిజనులను గోస పెట్టీ వారి రిజర్వేషన్ 6శాతం నుంచి 10 శాతంకి పెంచుతూ జీఓ జారీ చేశారని ఆ హామీ అయిన నెరవేరేనా అని ఎద్దేవా చేశారు. ఒక వైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ కేంద్రంలో బీజేపీ, ఇచ్చిన హామీలను విస్మరిస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తూ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకుండా ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయని, ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు ప్రచార ఆర్భాటాలు మాని నిర్మాణాత్మకంగా వ్యవరిస్తూ పాలన కొనసాగించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కళ్లేపల్లి దుర్గయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, నాయకులు చందా రాధకిషన్, చాంద్ పాషా, నక్క జీవన్, నేహాల్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.