వర్షం బీభత్సం... భారీ వృక్షం పడి రెండు ట్రాక్టర్లు ధ్వంసం
మండలంలోని పలు గ్రామాలలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం అపార... Rain in Ganneru Varam
దిశ, గన్నేరువరం: మండలంలోని పలు గ్రామాలలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. మాదాపూర్ గ్రామంలో చెరువు కట్ట సమీపంలో చెట్టు రోడ్డుపై పడిపోయి రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఈదురు గాలులతో వడగండ్ల వాన కురవడంతో మాదాపూర్ గ్రామంలో చేతికి అందివచ్చిన మొక్కజొన్న పంట పూర్తిస్థాయిలో నేలకొరిగింది. మామిడి తోటల్లో మామిడికాయలు భారీ సంఖ్యలో రాలిపోయాయి. గన్నేరువరం మండల కేంద్రంలో కాంతాల కిషన్ రెడ్డి, కాంతాల కొండాల్ రెడ్డిలకు చెందిన ట్రాక్టర్లపై ఒక పెద్ద చెట్టు విరిగిపడటంతో రెండు ట్రాక్టర్లు ధ్వంసం అయ్యాయి. మాదాపూర్ చెరువు కట్టపై రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును ఇప్పటివరకు ఎవరూ తొలగించలేదు. అధికారులు స్పందించి వెంటనే తొలగించి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. అకాల వర్షంతో పంట నష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు కొమ్మెర రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేయడానికి సర్వే నిర్వహించాలని ఆయన కోరారు.