Bhatti Vikramarka : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తోంది
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు
దిశ, పెద్దపల్లి : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లపాటు దుర్మార్గపు ప్రభుత్వం రాజ్య మేలిందన్నారు. గత డిసెంబర్ లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇందిరమ్మ రాజ్యం నిర్మించే దిశగా పనిచేస్తున్నామన్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా రామగుండంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని త్వరలో మంజూరు చేస్తామన్నారు.
24 గంటల పాటు విద్యుత్ ఉత్పాదన జరిపి రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను సర్ప్లస్ పవర్ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మే విధంగా తయారు చేస్తామన్నారు. ఎన్నికల హామీలు భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి వారి టికెట్ల కోసం ఇప్పటికే ఆర్టీసీకి రూ. 2500 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షల రూపాయలకు పెంచామని, రాష్ట్రంలో నాలుగు లక్షల 50వేల డబుల్ బెడ్ రూమ్ గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రతి నియోజకవర్గంలో 3500 డబుల్ బెడ్రూం లు నిర్మించి అర్హులైన నిరుపేదలకు అందిస్తామన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పాలించిన లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు చేయలేకపోయిందని,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేసి చూపామన్నారు.ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిందన్నారు.సాంకేతిక కారణాల వల్ల ఎవరైనా రైతులకు రుణమాఫీ జరగకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులకు తెలియజేస్తే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు.ప్రతి ఏడాది మహిళలకు రూ. 20వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.
గత ప్రభుత్వం రెసిడెన్షియల్ కళాశాలలకు గత ఏడాది మూడు కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించిందని, తమ ప్రభుత్వం ఈ ఏడాది కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుంటే పదేళ్లపాటు ప్రజలను మోసగించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి వస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉచిత ప్రయాణం వద్దని ప్రజలకు చెబుతారా లేదా రెండు లక్షల రుణమాఫీ వద్దని చెబుతారా అని ప్రశ్నించారు. బహిరంగ సభలో మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్, వినోద్, వివేక్, ప్రేమ్సాగర్ రావు, విజయ రమణారావు, లక్ష్మణ్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.