మార్చి 31 లోగా పెండింగ్ పనులను పూర్తి చేయాలి : మంత్రి గంగుల కమలాకర్
నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
దిశ, కరీంనగర్ టౌన్ : నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పీఆర్, ఆర్అండ్ బీబి, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ మరియు విద్యుత్ శాఖల అధికారులు, కరీంనగర్ నియోజకవర్గంలోని ఎంపీటీసీ లు, సర్పంచ్ లు ఇతర ప్రజాప్రతినిధులతో గ్రామాల వారీగా చేపట్టాల్సిన, పెండింగ్ పనులను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి 50 కోట్లు మంజూరు చేశారని, వాటిని మార్చ్ 31లోగా పూర్తి చేసి ఏప్రిల్ నుండి కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులను మంజూరు చేసుకొని మరింత అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించు కోవాలని తెలిపారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80 శాతం పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని, మిగిలి ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పంచాయతీ రాజ్ నిధులతో టెండర్లు పూర్తి అయిన పనులు వెంటనే పూర్తి చేయాలని, మిగిలిన పనులకు అంచనాలు సిద్ధం చేయాలని, పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. నియోజకవర్గంలో రూ.2.80 లక్షలతో మంజూరు చేసుకున్న సంఘ భవనాలను ఫర్నిచర్ తో సహా పూర్తి చేయాలని, మిగిలిన సంఘ భవనాలకు నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరు చేసుకున్న రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసుకోవడంతో పాటు పంచాయతీ రాజ్ రోడ్లన్ని పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి ఇంచుకు నీరు అందించుకుంటు జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులకు సమృద్ధిగా నింపి కరీంనగర్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపామని తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పనులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని అన్నారు.
కరెంటు లూజ్ లైన్స్ ను సరిచేయాలని, విరిగిపోయిన స్తంభాలను తొలగించి కొత్తవి అమర్చాలని, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్. వీ. కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంక, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, జెడ్పటీసీలు కరుణ, పి.లలిత, పీఆర్ ఎస్ఈ ,ఆర్ అండ్ బీ ఎస్ ఈ, ఇరిగేషన్ ఈ ఈ లు, ఎలక్టిసిటీ ఎస్ఈ గంగాధర్, సీపీఓ కొమురయ్య, ఎంపీపీ లు లక్ష్మయ్య, శ్రీలత, కొత్తపల్లి మున్సిపాలిటీ చైర్మన్ రుద్ర రాజు, కోఆప్షన్ మెంబర్ సాబీర్ పాషా, ఎంపీటీసీ, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.