Sarpanch Elections: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సంచలన పిలుపు
పర్రె మేడిగడ్డకు పడలే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పుర్రెకు పడిందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: పర్రె మేడిగడ్డకు పడలే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పుర్రెకు పడిందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన సిరిసిల్ల(Sircilla)లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) విషయంలో కాంగ్రెస్ నేతలే ఏదో దొంగచాటుగా చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయని.. కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఎవరూ ప్రేక్షక పాత్ర పోషించొద్దని కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దని.. ఎవరు ఏం చేయలేరు అని అన్నారు. బీఆర్ఎస్‌పై సోషల్ మీడియాల్లో చిల్లర పోస్టులు పెట్టించే వారిని, పెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని కీలక వ్యాఖ్యలు చేశారు. బాక్సింగ్‌లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు అని అన్నారు.
పార్లమెంట్ ఎన్నిక(Parliament Elections)ల్లో కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. మనకు సున్నా సీట్లొచ్చినా భయపడలేదు. మళ్లీ దేశంలో కేసీఆర్(KCR) చక్రం తిప్పే రోజు తప్పకుండా వస్తుందని జోస్యం చెప్పారు. నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అధికారంలోకి వస్తే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పామని తెలిపారు. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట అని ఎద్దేవా చేశారు. పదేళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పుజేసిందని విమర్శించారు. తాము చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి జరిగింది.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా(Hydra) పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని నిలువునా దోచుకొని ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారు. కొడంగల్ భూములివ్వని కేసులో కూడా తనను ఇరికించే ప్రయత్నం చేశారు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ఆలోచనలో పడ్డారని అన్నారు. వాళ్లు కేసుల గురించి ఆలోచించినా సరే.. మనం రైతుల గురించి ఆలోచిద్దామని కీలక పిలుపునిచ్చారు. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందామని అన్నారు. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలని సూచించారు.