పెద్దాపూర్ గురుకుల ఘటనపై కలెక్టర్ సీరియస్... మెమోలు జారీ

Update: 2024-08-10 04:55 GMT

దిశ, మెట్ పల్లిః మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పది రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీంతో ఇదే ఘటనపై జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ పెద్దాపూర్ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి పై, జగిత్యాల కన్వీనర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లపై కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రాంబాబు క్రమశిక్షణ చర్యలో భాగంగా మెమోలు జారీ చేశారు.

మౌలిక సదుపాయాలకు రూ.15 లక్షలు మంజూరు...

మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గత నెల 26 న మరణించిన రాజారపు గణాదిత్య, శుక్రవారం మరణించిన విద్యార్థి అనిరుద్ మరణాలు బాధాకరమని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. మొదటి విద్యార్థి చనిపోయిన అనంతరం తదుపరి విద్యార్థులను నూతన భవనంలోకి మార్చామని గురుకుల పాఠశాల, కళాశాలకు రూ.15 లక్షల రూపాయలను మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం జారీ చేసిందని నెల రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.

Tags:    

Similar News