Pandavula Gutta: కనుమరుగవుతోన్న పాండవుల గుట్ట.. వందల టిప్పర్లలో మట్టి తరలింపు

హుజూరాబాద్‌లోని రంగాపూర్ శివారులోని పాండవుల గుట్టను మళ్లీ తోడేస్తున్నరు.

Update: 2024-09-14 02:47 GMT

దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్‌లోని రంగాపూర్ శివారులోని పాండవుల గుట్టను మళ్లీ తోడేస్తున్నరు. నిత్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని రవాణా చేస్తున్నారు. వందల కొద్ది టిప్పర్లలో మట్టి దొంగలు బహిరంగంగా జేసీబీలతో మట్టిని తోడుతూ గుట్టలను మొత్తం తవ్వేస్తూ పకృతి సంపదను బహిరంగంగా ఛిద్రం చేస్తున్నారు. అయినా పట్టించుకోవాల్సిన మైనింగ్, విజిలెన్స్ అధికారులు పట్టించుకోవడం లేదు. 30ఏళ్లకాలంలో తవ్వినా తరగని మట్టిని గత మూడు సంవత్సరాలుగా కొల్లగొడుతూ గుట్టల ప్రాంతంలో పెద్ద గొయ్యిలు చేస్తున్నారు. పట్టించుకుని పర్యావరణ సమతుల్యతకు దెబ్బ పడకుండా చూడాల్సిన అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఈ పాండవుల గుట్టపై ఆధారపడిన పశువులు, వన్యప్రాణులు, అడవి జంతువులు తమకు గూడు లేక అల్లాడుతున్నాయి. పత్రికల్లో మట్టి మాఫియాపై వార్తలు వచ్చిన రోజున తూతూ మంత్రంగా వచ్చి చూసి పోతున్నారు తప్పా వారు చేసింది లేదు. అంతేకాక వచ్చే ముందు మట్టిమాఫియాకు సమాచారం అందిస్తున్నారు. దీంతో వారు అక్కడకు వచ్చే లోపే ఇక్కడంతా గప్ చుప్ అవుతున్నారు. దీంతో అధికారులు అక్కడికి వచ్చి చూసి ఏమి జరగడం లేదని వెళ్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

విచ్చలవిడిగా తవ్వకాలు..

పాండవుల గుట్టపై గత మూడు, నాలుగు ఏళ్లుగా మట్టిమాఫియా దాడి చేస్తుంది. మట్టి దందాతో లాభాలు విపరీతంగా ఉండడంతో గతంలో ఒకరిద్దరు మాత్రమే చేయగా నేడు వందల సంఖ్యకు చేరుకున్నారు. పకృతి పచ్చదనాన్ని అనుభవించడానికి హుజూరాబాద్ పట్టణానికి పక్కనే ఉన్న పాండవుల గుట్ట పట్టణప్రియులకు అనువుగా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ భూమి వందల ఎకరాల్లో ఉంటుంది. ప్రస్తుతం పాండవుల గుట్ట మధ్య నుంచి నేషనల్ హైవే-563 నిర్మాణం జరుగుతుంది. దీంతో ఈ గుట్టను అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పిస్తే పకృతి ప్రేమికులకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడడం లేదు. కొన్నివేల మంది పకృతి ప్రేమికులకు సొంతం కావాల్సిన ఈ ప్రాంతం కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, అవినీతి మూలంగా నేడు మట్టి మాఫియా చేతుల్లో పడి నలిగిపోతుంది.

మట్టి మాఫియా హల్‌చల్..

హుజూరాబాద్ పక్కనే ఉన్న పాండవుల గుట్టపై మట్టిమాఫియా రాత్రి, పగలు అనే తేడా లేకుండా హల్ చల్ చేస్తుంది. ఇక్కడికి ఒంటరిగా వెళ్లాలంటే సామాన్యులు భయపడే పరిస్థితులను మట్టిమాఫియా కల్పిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో జేసీబీలు, వందల సంఖ్యలో లారీలు ఇక్కడ కోలాహలం చేస్తుంటాయి. పెద్దా, చిన్న లారీలు బహిరంగంగా మట్టి తోడి తరలిస్తున్నా అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.

రూ.1500 రూ.1800 రేటు ఫిక్స్

హుజూరాబాద్, జమ్మికుంటతోపాటుగా వరంగల్, శంకటపట్నం వంటి పట్టణాలకు మట్టి సరఫరా చేస్తున్నారు. చిన్న లారీల్లో సమీప గ్రామాలు, పట్టణాలకు, పెద్ద లారీల్లో దూర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. పగలు పక్కనే ఉన్న గణేష్ నగర్‌లో డంప్ చేస్తూ రాత్రిపూట సరఫరా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆ గోతులు మాఫియాకు వరం

పాండవుల గుట్టను ఈ మధ్య కాలంలో నేషనల్ హైవే 563 కోసం మైనింగ్ అనుమతులు తీసుకొని తవ్వకాలు చేపట్టారు. వారికి కేటాయించిన మేరకు గుట్టను తవ్వి మట్టిని తీశారు. వారికి కేటాయించిన కన్న ఎక్కువ లోతులో మట్టి తీయడంపై గతంలో దిశ వార్తలు రాయడంతో స్పందించిన మైనింగ్ అధికారులు డిబిఎల్ కంపెనీకి లెక్క ప్రకారం వారు తీసిన మట్టికి రూ.3కోట్ల ఫెనాల్టీ విధించారు. దీంతో వారు తీసిన గోతులు వదిలి పక్కనే ఉన్న మరో ప్రాంతంలో మైనింగ్ లీజు తీసుకున్నారు. కాగా డిబిఎల్ కంపెనీ వదిలి వేసిన గోతులు ప్రస్తుతం మట్టి మాఫియాకు వరంగా మారాయి. ప్రస్తుతం ఆ గుంతలనుంచి నిత్యం వందల సంఖ్యలో మట్టిని జేసీబీలతో తీస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు.

బాధ్యులను కఠినంగా శిక్షించాలి

పకృతి వన సంపదను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తద్వారా వన సంపదతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఎన్నిసార్లు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News