పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

Update: 2024-10-25 09:16 GMT

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు శాఖ, 17వ బెటాలియన్ సంయుక్తంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆయన 17వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్ రావుతో కలిసి పాల్గొన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌక్, కొత్త బస్టాండ్, నేతన్న చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ సాగింది.

     అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని, అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ వారి మన్ననలను పొందేలా విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయరక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలన్నారు.

    వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ కృష్ణ, ఆర్ఐలు మధుకర్, రమేష్, సీఐలు శ్రీనివాస్, మధుకర్, ఎస్ఐలు 17వ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News