సుపారీ కోసం వచ్చి హతమై.. పథకం ప్రకారమే ముంబై గ్యాంగ్‌స్టర్ హత్య
సుపారీతో ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం పన్నిన ముంబై గ్యాంగ్‌స్టర్ హత్యకు గురికావడం కలకలం రేపింది.
దిశ, వెల్గటూర్: సుపారీతో ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం పన్నిన ముంబై గ్యాంగ్‌స్టర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. అదే సుపారీ ఇచ్చిన వారి చేతుల్లోనే హత్యకు గురికావడం మండలంలో సంచలనం రేపింది. ప్రశాంతంగా పొలం పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పల్లెజనం సమీప అటవీ ప్రాంతంలో జరిగిన హత్య ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కడంతో హత్యకు పాల్పడిన నిందితులు భయపడి ధర్మపురి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మర్డర్ సీన్‌ను రీ కన్‌స్ట్రక్షన్ చేయడంలో భాగంగా డీఎస్పీ రఘుచందర్, సీఐ రాంనర్సింహారెడ్డి ఆదివారం నిందితులతో కలిసి హత్య జరిగిన స్థలంతోపాటు శవాన్ని దహనం చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆధారాలను సేకరించి హత్య జరిగిన తీరును వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మణ్, కమలాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల గోపాల్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరు ముంబైలో కల్లు బిజినెస్ చేస్తున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి మెరుగు లక్ష్మణ్ మరదల్ని నేరెళ్లకు చెందిన తోకల గంగాధర్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు హెచ్చరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో గంగాధర్‌ను ఎలాగైనా చంపేసి తన మరదలకు ప్రశాంత జీవనం అందించాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన నేరెళ్ల గోపాల్‌కు తెలిపి గంగాధర్‌ను చంపడానికి ఎవరితోనైనా మాట్లాడాలని కోరాడు. తనకు తెలిసిన రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ (24) ముంబైలో గ్యాంగ్‌స్టర్ అని, అతడికి సుపారీ ఇస్తేనే హత్య చేయడానికి ఒప్పు కుంటాడని గోపాల్ లక్ష్మణ్‌తో అన్నాడు. రూ.4లక్షల సుపారీ ఇవ్వడానికి లక్ష్మణ్ ఒప్పుకోగా గోపాల్ ఈ విషయాన్ని గ్యాంగ్‌స్టర్ రాహుల్ ప్రకాష్ సింగ్‌కు వివరించగా ఆయన డీల్ ఒకే చేశారు. ఇంకేముంది మర్డర్ చేయడానికి డేట్, టైం అన్ని సెట్ చేసుకున్నారు. కాగా, ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. గ్యాంగ్‌స్టర్ సుపారీ డబ్బులు ఇవ్వాలని ఓ రోజు గోపాల్, లక్ష్మణ్‌కు ఫోన్ చేశాడు. ఎవరిని హత్య చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని వీరిద్దరూ గ్యాంగ్‌స్టర్‌కు తేల్చి చెప్పారు. దీంతో అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్ రాహుల్ ప్రకాష్ సింగ్ ఇబ్బంది మేరకు సుపారీ డబ్బులు ఇవ్వాలని గోపాల్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే మీ తండ్రి రమేష్‌ను చంపుతా అంటూ బెదిరిస్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన గోపాల్ అతడితో రాజీకుదుర్చుకున్నాడు. డీల్ ప్రకారం నీ సుపారీ ఇచ్చేస్తా ఈ నెల 12న నేరెళ్లకు రావాలని కోరగా రాహుల్ వచ్చాడు. ఈ నెల 13న అర్ధరాత్రి సమయంలో గోపాల్ నేరెల్లకు చెందిన గండికోట శేఖర్‌తో కలిసి రాహుల్ ప్రకాష్ సింగ్‌ను నేరెళ్ల సాంబశివ గుడి వద్దకు తీసుకెళ్లి అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో రాహుల్‌ను శేఖర్ మాటల్లో పెట్టగా గోపాల్ పెద్ద బండరాయితో రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ తలపై మోదీ హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావద్దనే ఆలోచనతో శవాన్ని సమీపంలో ఉన్న బట్టపెల్లి పోతారం అడవుల్లోకి తీసుకెళ్లారు. కట్టెలు పోగేసి శవాన్ని అందులో వేసి పెట్రోల్ పోసి కాల్చి వేశారు. శవం పూర్తిగా కాలిందో, లేదోనని మరుసటి రోజు నిందితులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సగం కాలిన శవాన్ని మళ్లీ కట్టెలు వేసి పూర్తిగా దగ్ధం అయ్యాక ఇంటికి వెళ్లారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కి పోలీసులకు తెలియడంతో విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఇంతలో నిందితులు నేరేళ్ల గోపాల్, గండికోట శేఖర్ రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్‌ను తామే హత్య చేశామని ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో హత్యకు సంబంధించిన విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ రఘుచందర్, సీఐ రాంనరసింహారెడ్డి తెలిపారు.