ధాన్యం దళారుల పాలు

ధాన్యం దళారుల పాలవుతోంది.

Update: 2024-10-25 11:36 GMT

దిశ, సైదాపూర్ : ధాన్యం దళారుల పాలవుతోంది. ముందస్తుగా సాగు చేసిన పలు చోట్ల రైతులు వరి కోతలు ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు విధిలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మద్దతు ధర కరువవుతోంది. కొందరు దళారులు కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్ లో ముందస్తుగా రైతులు నాట్లు వేసి పంటసాగు చేశారు. ఇప్పుడు పంట చేతికిరావడంతో కోతలు ప్రారంభించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

    మరోవైపు అకాల వర్షాల భయానికి పచ్చి వడ్లనే అమ్ముతున్నారు. కొందరు నేరుగా మిల్లర్లకు తరలించి అరకొర ధరకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు మిల్లర్లు, దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తాలు, తేమ శాతం అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,330 ఉండగా, మిల్లర్లు రూ.1890కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు దాదాపు రూ.400 నష్టపోతున్నారు. దీంతో పాటుగా అదనంగా సంచికి కిలో, తాలు, తేమ పేరిట మరో కిలో కోత విధిస్తున్నారు.

ఈ ఖరీఫ్ లో సన్న వడ్లకు బోనస్ అందేనా..?

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సన్న వడ్లకు రూ 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా బోనస్ ఇవ్వలేదు. ఈ ఖరీఫ్ లో సన్న వడ్లకు బోనస్ రూ. 500 ప్రభుత్వం ఇస్తుందా లేదా అనే అంశంపై రైతులు చర్చించుకుంటున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్​

ముందస్తుగానే దొడ్డు రకం వరిపంట సాగు చేశామని, పంట చేతికి రావడంతో కోశామని, ఇంతవరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేవని, మరోవైపు అకాల వర్షాలు పొంచి ఉండటంతో ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. మిల్లర్లు తక్కువ ధరకే కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. 

Tags:    

Similar News