గ్రేట్ కపుల్స్.. గ్రాండ్‌గా కుక్క పిల్లలకు నామకరణం ఫంక్షన్

మనుషుల మధ్యనే ప్రేమలు కరువవుతున్న ఈ ఆధునిక కాలంలో కుక్క పిల్లలకు బారసాల నిర్వహించిన సంఘటన జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పట్టణంలో జరిగింది.

Update: 2024-11-24 07:23 GMT

దిశ, కోరుట్ల: మనుషుల మధ్యనే ప్రేమలు కరువవుతున్న ఈ ఆధునిక కాలంలో కుక్క పిల్లలకు బారసాల నిర్వహించిన సంఘటన జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పట్టణంలో జరిగింది. సుభాష్ నగర్‌లో నివాసముంటున్న రాపెల్లి వినోద్ - లావణ్య దంపతులు సంవత్సరం నుంచి షీజూ జాతికి చెందిన కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. దానికి డైసీ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. వాళ్ల పిల్లలతో పాటుగా డైసీని కూడా కుటుంబ సభ్యురాలిగా సంరక్షించుకుంటున్నారు. ఈ మధ్యనే డైసీ నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.

అయితే వినోద్ - లావణ్య దంపతులు ఈ సెలబ్రేషన్‌ను గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కుక్క పిల్లలకు నామకరణం చేయాలని డిసైడ్ అయ్యారు. మనుషుల లాగానే వైభవంగా ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి కొత్త బట్టలు తొడిగి కుక్క పిల్లలకు నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దానితో పాటు అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. మనుషులు, మనసుల మధ్య దూరం పెరుగుతున్న ఈ కాలంలో మూగ జీవాల పట్ల ఈ కుటుంబం చూపుతున్న ప్రేమను చూసి పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.


Similar News